KCR: పంచాంగం ఒకటే... ఎవరి దగ్గర మాట్లాడితే వారికి అనుకూలంగా కాస్త చమత్కారం: కేసీఆర్

  • పంచాంగాలు ఎన్నడూ తప్పు చెప్పవు
  • ఎవరి ముందు మాట్లాడితే వారికి అనుకూలంగా కాస్తంత చమత్కారాన్ని జోడించే పండితులు
  • ఏతావాతా రాష్ట్రంలో వెలుగు జిలుగులే

తెలుగు రాష్ట్రాల్లో పంచాంగాలన్నీ ఎన్నడూ తప్పు చెప్పవని, అన్నీ ఒకటే చెబుతాయని, అయితే ఎవరి ముందు పంచాంగాన్ని వినిపిస్తుంటే, వారికి అనుకూలంగా మాట్లాడే విధంగా కొంత చమత్కారాన్ని జోడించి పండితులు చెబుతుంటారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి రాజ్యపూజ్యం 7, అవమానం 3గా పంచాంగాలు చెబుతున్నాయని అన్నారు. ఆదాయం 8, ఖర్చు 2 ఉంటుందని పండితులు చెప్పారని, ఏతావాతా రాష్ట్రం వెలుగు జిలుగులతో వర్థిల్లుతుందని వెల్లడించారు. అద్భుతమైన సిరిసంపదలతో తెలంగాణ తులతూగుతుందని చెప్పినందుకు పంచాంగకర్తలకు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందుతూ జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ. 50 వేల కోట్లకు పైగా ఇస్తుంటే, మనకు రూ. 24 వేల కోట్లే వస్తోందని, అయినా, మన ఆదాయంలో మనల్ని మనం పోషించుకుంటూ దేశాన్ని అభ్యదయ పథంలోకి తీసుకెళుతున్నామన్న సంతృప్తిలో ఉన్నామని తెలిపారు.

More Telugu News