NDA: ఇక మోదీ పని అయిపోయినట్టే.. మాజీ ప్రధాని దేవెగౌడ

  • విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారు
  • నోట్ల రద్దు, జీఎస్టీతో ఇప్పటికే మోదీ ప్రభ తగ్గింది
  • ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో మరింత మసకబారింది
  • జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ

ప్రధాని నరేంద్రమోదీ హవా రోజురోజుకు కుంచించుకుపోతోందని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ పేర్కొన్నారు. ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడంతో మోదీ ప్రాభవానికి ఇక బీటలు వారినట్టేనన్నారు. శుక్రవారం ఆయన తన సొంత నియోజకవర్గమైన హసన్‌లో మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో మోదీ వెనక్కి తగ్గారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీతో మోదీ ప్రభ బాగా మసకబారిందని, ఇప్పుడు టీడీపీ బయటకు రావడంతో మరింత దెబ్బ తగలడం ఖాయమని అన్నారు.

ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉందన్నారు. విభజన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి టీడీపీతో బీజేపీ జతకట్టిందని, ఇప్పుడు మోదీ యూటర్న్ తీసుకుని ఏపీకి మొండిచెయ్యి చూపారని విమర్శించారు. నాలుగేళ్లయినా హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని, ప్రత్యేక ప్యాకేజీని కూడా వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ హామీల విషయంలో మోదీ యూటర్న్ తీసుకోవడం ద్వారా జాతీయస్థాయిలో కొత్త కూటములకు అవకాశం ఇచ్చినట్టు అయిందని దేవెగౌడ అభిప్రాయపడ్డారు.

More Telugu News