Giriraj Singh: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • ఉప ఎన్నికల్లో ఓడిపోవడంపై మంత్రి అసహనం
  • అరారియా ఇక ఉగ్రవాద స్థావరంగా మారుతుందని వ్యాఖ్య
  • వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో వ్యక్తిగా మారిన గిరిరాజ్

కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లోని అరారియా పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. అరారియా నిండా ముస్లింలే ఉన్నారని, అందుకే బీజేపీ ఓడిపోయిందని, ఇక అరారియా ఉగ్రవాద స్థావరంగా మారిపోతుందని వ్యాఖ్యానించి కలకలం రేపారు.

‘‘అరారియా నేపాల్, బెంగాల్ సరిహద్దు ప్రాంతమే కాదు. ఇక్కడ మతవాద సిద్ధాంతం పురుడుపోసుకుంది. ఇది ఒక్క బీహార్‌కే కాదు.. యావత్ దేశానికే పెను ముప్పుగా పరిణమిస్తుంది. ఇది ఉగ్రవాద స్థావరంగా మారిపోతుంది’’ అని మంత్రి గిరిరాజ్ పేర్కొన్నారు. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రదీప్ సింగ్‌పై ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ ఆలం భారీ మెజార్టీతో గెలిచారు.

ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గిరిరాజ్‌కు కొత్తకాదు. ముస్లిం జనాభా పెరగడం సమాజానికి అంతమంచిది కాదని గతంలో వ్యాఖ్యానించారు. అలాగే నరేంద్ర మోదీ వ్యతిరేకులు దేశం విడిచి పాకిస్థాన్ వెళ్లిపోవాలని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీకి మంచి మేనిఛాయ ఉందనే ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అంగీకరించారని ఆరోపించి దుమారం రేపారు. కాగా, మంత్రి తాజా వ్యాఖ్యలపై ఆర్జేడీ సహా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

More Telugu News