MS Dhoni: టీ-20 స్కోరులో ధోనీని క్రాస్ చేసిన రైనా

  • టీ-20 మ్యాచ్‌లలో 1452 పరుగులతో ధోనీని పక్కకు నెట్టిన రైనా
  • అగ్రస్థానాల్లో కోహ్లీ (1983 పరుగులు), రోహిత్ (1696 పరుగులు)
  • బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాతో భారత్ ఢీ

ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న టీ-20 ముక్కోణపు సిరీస్‌ ద్వారా సుదీర్ఘ విరామానంతరం టీమిండియాలో చోటు దక్కించుకున్న సురేశ్ రైనా ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ-20ల్లో భారత్ తరపున అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీని అతను పక్కకు నెట్టేశాడు. ధోనీ ఇప్పటివరకు 1444 పరుగులు చేశాడు. అయితే నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రైనా 27 పరుగులు చేయడం ద్వారా 1452 పరుగులతో ధోనీని మించిపోయాడు.

విరాట్ కోహ్లీ (1983), రోహిత్ శర్మ (1696) స్కోర్లతో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో ధోనీ, రైనా చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) తరపున ఆడనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు ఐసీసీ కేలండర్‌ను దష్టిలో ఉంచుకుని శ్రీలంక ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియాలోని ఐదుగురు సీనియర్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఇక లంక ముక్కోణపు టోర్నీ విషయానికొస్తే...ఇప్పటికే రెండు గెలుపులతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ బుధవారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

More Telugu News