All India Majlis-e-Ittehad-ul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi: గాడ్సేపై ఒవైసీ కామెంట్...దమ్ముంటే తనకు నోటీసివ్వాలని సవాల్

  • 70 ఏళ్లుగా ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన
  • భారతదేశంలోని ముస్లింలు పాకిస్తాన్‌ లేదా సిరియాకు వెళ్లరని స్పష్టీకరణ
  • ప్రధాని మోదీ ముస్లింలకు శత్రువని మండిపాటు

మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు భారతదేశాన్ని అమ్మాలని ఎన్నడూ కోరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ...ముస్లింలు గత 70 ఏళ్లుగా అణచివేతకు, బెదిరింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే 'నంబర్‌వన్ హిందూ రత్న ఉగ్రవాది' అంటూ ఒవైసీ వివాదాస్పదంగా మాట్లాడారు. ఇలాంటి ప్రకటన చేసిన తనకు దమ్ముంటే నోటీసును పంపవచ్చని ఆయన సవాలు విసిరారు.

తాము ఎవరికీ భయపడేది లేదని, చంపాలనుకుంటే తమను చంపవచ్చని, జీవిస్తే ఇక్కడే జీవిస్తామని, ఇక్కడే మరణిస్తామని ఒవైసీ ఉద్వేగంతో మాట్లాడారు. భారతదేశంలోని ముస్లింలు సిరియా లేదా పాకిస్తాన్‌కు వెళ్లబోరని ఆయన స్పష్టం చేశారు. తమ పూర్వీకులు బ్రిటీషువారికి వ్యతిరేకంగా పోరాడారని, 'హిందూస్తాన్ జిందాబాద్' నినాదాలూ చేశారని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ప్రస్తుతం రాజ్యసభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు‌పైనా ఆయన ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ముస్లింల శ్రేయోభిలాషి కారని, ఆయన తమకు శత్రువని, తమకు అన్యాయం చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

More Telugu News