hardhik patel: అప్పుడు రాహుల్ ను కలవకపోవడం అతిపెద్ద పొరపాటు: హార్దిక్ పటేల్

  • రాహుల్ తో సమావేశమై ఉంటే బీజేపీకి కేవలం 79 సీట్లు మాత్రమే దక్కేవి
  • బీజేపీ అధికారానికి దూరమై ఉండేది
  • మోదీకి మేము కూడా ఓటేశాం.. కానీ, ఆశలను అడియాశలు చేశారు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని తాను కలవకపోవడం అతి పెద్ద తప్పని పటిదార్ నేత హార్దిక్ పటేల్ అన్నారు. తాను రాహుల్ తో భేటీ అయి ఉంటే, ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చి ఉండేవని, అధికారానికి బీజేపీ కచ్చితంగా దూరమై ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ మాట్లాడుతూ, ఇదే విషయాన్ని తాను ఇంతకు ముందే చెప్పానని, ఇప్పుడు మరోసారి చెబుతున్నానని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, నితీష్ కుమార్ లను తాను కలిసినప్పుడు... రాహుల్ ను కలవడంలో ఎలాంటి తప్పు లేదని తెలిపారు.

189 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో 99 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ విషయంపై హార్దిక్ మాట్లాడుతూ, తాను రాహుల్ తో సమావేశమై ఉంటే... బీజేపీకి కేవలం 79 సీట్లు మాత్రమే వచ్చి ఉండేవని చెప్పారు. పటిదార్లకు రిజర్వేషన్ల కోసం తాను చేస్తున్న పోరాటాన్ని విరమిస్తే, తనకు రూ. 1,200 కోట్లను ఇచ్చేందుకు రెడీ అంటూ గుజరాత్ కు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తనకు ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. ఉద్యమం నేపథ్యంలో, అమాయకులపై కేసులు బనాయించారని... ఇప్పుడు వారంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ నిలుచున్నప్పుడు తాము కూడా ఆయనకు ఓటు వేశామని చెప్పారు. మోదీ ప్రధాని అయితే... దేశంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తామంతా ఆశ పడ్డామని, రైతుల కష్టాలకు తగిన ధరలు లభిస్తాయని భావించామని... కానీ, ఏ ఒక్కటీ జరగలేదని విమర్శించారు. 

More Telugu News