Irffan khan: మా ఆయన యోధుడు...నన్నూ అలాగే మలిచారు...ఇర్ఫాన్ ఖాన్ భార్య

  • తన భర్తకు సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం ఉందని వెల్లడి
  • తన భర్త ఆరోగ్యం గురించి దేవుడ్ని ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు
  • జీవిత పోరాటంలో సమస్యలను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టానని ప్రకటన
  • అభిమానులూ అదే రీతిలో పోరాటం చేయాలని సూచన
తన భర్త యోధుడని, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం తనకు ఉందని బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ భార్య సుతాపా సిక్‌దర్ తెలిపింది. తనకు ఓ అరుదైన వ్యాధి సోకిందంటూ ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఫ్యాన్స్‌ని తీవ్ర ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ అరుదైన వ్యాధి ఏంటో తెలుసుకోవాలని అందరికీ ఆత్రుత పట్టుకుంది. కొందరైతే ఆన్‌లైన్‌లో ఆయన అనారోగ్యంపై ఊహాగానాలు చేయసాగారు. దీంతో ఇక లాభం లేదు...ఏవేవో మనసుకు నచ్చింది దుష్ప్రచారం చేస్తున్నారని భావించిన ఇర్ఫాన్ తానే స్వయంగా రంగప్రవేశం చేశారు. తన రోగమేంటో తానే చెబుతానని అంతవరకు ఊహాగానాలతో అందరిన బెంబేలెత్తించవద్దని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.

తన భర్త ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ పలువురు తనకు కాల్స్ చేశారని, సందేశాలు పంపారని, వాటికి బదులివ్వనందుకు తనను క్షమించాలని సిక్‌దర్ కోరారు. ఇర్ఫాన్ ఆరోగ్యం కుదుటపడాలంటూ దేవుడికి ప్రార్థనలు చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తనను కూడా వారియర్‌గా మలిచినందుకు దేవుడికి, తన భర్తకు రుణపడి ఉంటానని ఆమె అంది. ప్రస్తుతం జీవితమనే యుద్ధక్షేత్రంలో ఎదురొచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాలపై దృష్టి పెట్టానని ఆమె తెలిపింది. ఇర్ఫాన్ అభిమానులు కూడా ఇదే రీతిలో తమ జీవిత పోరాటంలో గెలిచేలా ప్రయత్నించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఇక సినిమాల విషయానికొస్తే...ఇర్ఫాన్ నటించిన 'బ్లాక్‌మెయిల్' చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Irffan khan
Sutapa Sikdar
Social Media
Blackmail

More Telugu News