MS Dhoni: బుమ్రా, భువీ కంటే ధోనీకి తక్కువ చెల్లింపులకు కారణమేంటి?

  • ధోనీకి ఏ-కేటగిరీ కింద ఐదు కోట్ల చెల్లింపు
  • ఏ-ప్లస్ కేటగిరీలో బుమ్రా, భువీ, రోహిత్‌లకు ఏడు కోట్లు
  • మూడు ఫార్మాట్లలో ఆడటం, ఐసీీసీ టాప్-10 ప్లేయర్లలో చోటు సంపాదించినందుకు అధిక చెల్లింపులు

టీమిండియాలో మూడు ఫార్మాట్లలోనూ వీరవిహారం చేసిన బ్యాట్స్‌మన్ ఎవరంటే.. తొలుత గుర్తొచ్చేది ధనాధన్ ధోనీ పేరే. కెప్టెన్‌గా జట్టును విజయపథాన నడిపించిన సారథి అతను. కానీ, బీసీసీఐ తాజాగా ప్రకటించిన ప్లేయర్ల వార్షిక కాంట్రాక్టుల జాబితా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత కాంట్రాక్టు మాదిరిగానే అక్టోబరు, 2017-సెప్టెంబరు 2018 మధ్యకాలానికి ధోనీకి గ్రేడ్-ఎ కేటగిరీని బోర్డు కొనసాగించింది. ఈ కాంట్రాక్టు పీరియడ్‌లో అతనికి రూ.5 కోట్లను చెల్లిస్తారు. ఏ-ప్లస్ గ్రేడును బోర్డు ఈ సారి కొత్తగా తెరపైకి తీసుకొచ్చింది. ఈ కేటగిరీలోని ప్లేయర్లకు రూ.7 కోట్లు చెల్లిస్తారు.

ధోనీ ఏ-గ్రేడ్ ప్లేయర్‌గా ఐదు కోట్లే అందుకుంటుండగా, కొత్త కేటగిరీలో చోటుసంపాదించుకున్న ప్లేయర్లు తన కంటే తక్కువ అనుభవమున్నప్పటికీ, ఎక్కువ మొత్తంలో చెల్లింపులు అందుకోనుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఏ-ప్లస్ కేటగిరీలో జస్‌ప్రీత్ బుమ్రా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ థావన్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. వారందరూ ధోనీ కంటే తక్కువ అనుభవమున్నవారే.

కానీ, ఎక్కువ ఫీజును అందుకోబోతున్నారు. ఇందుకు కారణం, ప్రస్తుతం వారు మూడు ఫార్మాట్లలోనూ ఆడుతుండడం, ఐసీసీ ప్లేయర్ల ర్యాంకుల్లో టాప్ 10లో నిలవడం. కాగా, ధోనీ సారథ్యంలోని టీమిండియా 2007లో ఐసీసీ నిర్వహించిన తొలి టీ-20 ప్రపంచకప్‌ను, 2011లో వన్డే ప్రపంచకప్‌ను, 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News