Andhra Pradesh: హోదా వద్దని చంద్రబాబు చెప్పలేదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్స్ నా వద్ద ఉన్నాయి: బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ

  • హోదాతో రూ. 3 వేల కోట్లే వస్తాయన్నారు
  • అసెంబ్లీలో మాట్లాడిన ఆకుల సత్యనారాయణ
  • తాను ఆ మాట అనలేదన్న చంద్రబాబు
  • అనవసరంగా మాట్లాడవద్దని సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని, హోదాతో రూ. 3 వేల కోట్లకు మించి రావని గతంలో పలుమార్లు సీఎం చంద్రబాబునాయుడే స్వయంగా చెప్పారని, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో వచ్చిన ఆ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ తన వద్ద ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాతో రాష్ట్రం అభివృద్ధి చెందదని, విభజన చట్టంలో లేనివాటిని ఎన్నింటినో కేంద్రం ఇచ్చిందని చెప్పారు.

 ఆ సమయంలో చంద్రబాబు కల్పించుకుని, హోదాతో కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే వస్తాయని ఎప్పుడూ చెప్పలేదని, తాను అలా అన్నట్టు 'సాక్షి'లో వస్తే తాను చెప్పలేనని అన్నారు. విభజన హామీలు అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండని చెప్పారు. బీజేపీ వారు అసెంబ్లీలో అనవసరంగా మాట్లాడకుండా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి ఏం సాయం చేశారో సమీక్ష జరిపి రావాలని అన్నారు.

ఆపై తన ప్రసంగాన్ని కొనసాగించిన ఆకుల సత్యనారాయణ, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను సభ ముందుంచారు. రెవెన్యూ లోటు విషయంలో కేంద్ర, రాష్ట్ర గణాంకాల మధ్య తేడా ఉందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలను చెప్పలేదని విమర్శించారు. ఎమ్మెల్యే సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీలా వేషం వేసుకున్న వ్యక్తిని మహిళలతో కొట్టించడం ఆయన్ను అవమానించడమేనని అన్నారు.

More Telugu News