Dawood Ibrahim: షరతులకు ఒప్పుకుంటే, లొంగిపోతానని చెప్పిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. తిరస్కరించిన భారత్!

  • కొన్ని షరతులతో లొంగిపోయేందుకు సిద్ధమని భారత్‌కు తెలిపిన దావూద్
  • షరతులకు అంగీకరించని భారత్
  • థానే కోర్టుకు తెలిపిన సీనియర్ న్యాయవాది

భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్‌కు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు. తాను లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నానని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ద్వారా భారత ప్రభుత్వానికి తెలియజేశాడు. అయితే ఇందుకోసం కొన్ని షరతులు విధించాడు. కేసు విచారణ సమయంలో అర్థర్ రోడ్ జైలులో తనను పెడతానంటేనే లొంగిపోతానని పేర్కొన్నాడు. అతడి షరతులకు ప్రభుత్వం నిరాకరించిందని, దావూద్‌ను అరెస్ట్ చేయలేదని దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ కేశ్వాని తెలిపారు.

దోపిడీ కేసులో కేస్కర్‌ను మంగళవారం థానె పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్‌వీ థమదేకర్ ఎదుట హాజరు పరిచారు. మిరా రోడ్ బిల్డర్‌ను బెదిరించిన కేసులో కస్కర్, ఆయన సోదరుడు దావూద్, అనీస్‌లపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

కోర్టుకు హాజరైన కస్కర్‌ను న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. సోదరుడు దావూద్, ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడున్నారన్న ప్రశ్నకు తనకు తెలియదని చెప్పిన కస్కర్ ఇటీవల దావూద్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు చెప్పాడు. అయితే అతడి నంబరు డిస్‌ప్లే కాదని, కాబట్టి అతడెక్కడున్నదీ తాను తెలుసుకోలేకపోతున్నానని న్యాయమూర్తికి తెలిపాడు. కాగా, ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కస్కర్‌ కస్టడీని కోర్టు మరో మూడు రోజులు పొడిగించింది.

More Telugu News