Vasupalli Ganesh: అడిగిన వెంటనే జగన్ కు మోదీ అపాయింట్ మెంట్ వస్తోంది... మమ్మల్నేమో మిత్రద్రోహులంటారా?: ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిప్పులు

  • నిన్న విశాఖలో వాసుపల్లి నిరసన
  • ఈ ఉదయం విమర్శలు గుప్పించిన బీజేపీ
  • కౌంటర్ ఇచ్చిన విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి
  • 2019 తరువాత ఎక్కడుంటారోనని ఎద్దేవా

పలు కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న వైకాపా అధినేత వైఎస్ జగన్ అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చే ప్రధాని నరేంద్ర మోదీని విభజన హామీల అమలుపై నిలదీస్తే మిత్రద్రోహమని వ్యాఖ్యానించడం ఏ మేరకు భావ్యమో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ప్రశ్నించారు. నిన్న తన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపడితే, మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజలను రౌడీలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రశ్నించారు.

నగరానికి రైల్వే జోన్ కోసం జరిపే ఏ నిరసన కార్యక్రమానికైనా తన మద్దతు ఉంటుందని, ఈ విషయంలో బీజేపీ సలహాలు వినాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్లో నిరసన కూడా ఉందని, 2019 తరువాత బీజేపీ రాష్ట్రంలో ఉంటుందో ఉండదో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని గణేష్ అన్నారు. బీజేపీ వైపు వేలెత్తి చూపితే ఏ1 నిందితుడని విమర్శిస్తున్నారని, తామేమైనా బీజేపీ ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్న బిచ్చగాళ్లమా? లేక పాకిస్థాన్ నుంచి వచ్చిన వాళ్లమా? అని ప్రశ్నించారు. తాను రక్షణ శాఖలో పనిచేసి వచ్చిన వ్యక్తినని, కేసులు, ప్రాణాలకు భయపడే రకాన్ని కాదని, ఎన్నో కేసులున్న సీకే బాబును బీజేపీ ఎందుకు తమ పార్టీలో చేర్చుకున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News