savrav ganguly: సెంచరీ చేయగానే ద్రవిడ్ బ్యాట్ ను కసిగా ప్రెస్ బాక్స్ వైపు చూపించాడు: గంగూలీ

  • లక్ష్మణ్ కోసం ద్రవిడ్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు
  • బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంతో ద్రవిడ్ లో కసి
  • సెంచరీ చేసి కసితీర్చుకున్న ద్రవిడ్

2001లో ఆస్ట్రేలియాతో కోల్ కతాలో జరిగిన ఈడెన్ గార్డెన్స్ టెస్టు అనుభవాలను దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన ఆటోబయోగ్రఫీ 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్' లో గుర్తు చేసుకున్నాడు. వాటి వివరాల్లోకి వెళ్తే... కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులు చేసింది. టీమిండియా 171కే ఆలౌట్‌ అయింది. వీవీఎస్ లక్ష్మణ్ మినహా ఎవరూ రాణించలేదు. దీంతో ఆ టెస్టులో ఓటమి తప్పదని, సిరీస్‌ కూడా ఓడిపోతామని, తన కెప్టెన్సీ కూడా పోతుందని దాదా ఫిక్సయ్యాడు. ఆ బాధకు తోడు మీడియా కథనాలు కూడా తమను మరింత బాధపెట్టాయని పేర్కొన్నాడు. దీంతో ఫాలోఆన్ ఆడే సందర్భంగా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేశానని గుర్తు చేసుకున్నాడు.

వీవీఎస్‌ లక్ష్మణ్‌ ను బ్యాటింగ్‌ ఆర్డర్ లో ముందుకు తెచ్చినందుకు రాహుల్‌ ద్రవిడ్‌ కలత చెందాడని తెలిపాడు. దీంతో ఫాలోఆన్ లో సెంచరీ చేయగానే రాహుల్ తనలోని కసినంతా ప్రదర్శించాడని పేర్కొన్నాడు. తన బ్యాటును ప్రెస్‌ బాక్స్‌ వైపు చూపిస్తూ, సెంచరీ వందనం చేశాడని, దాని అర్థమేంటో జట్టులోని అందరికీ తెలుసని అన్నాడు. అది తనకెంతో నచ్చిందని తెలిపాడు.

ఆ తరువాత లక్ష్మణ్‌ (281), ద్రవిడ్‌ (180) రెండు స్తంభాల్లా నిలిచి జట్టుకు విజయం అందించారని తెలిపాడు. ఆ ఇన్నింగ్స్‌ తరువాత ద్రవిడ్‌ మరింత మెరుగైన ఆటగాడిగా మారాడని తెలిపాడు. ఆ తరువాత చెన్నైలో కూడా 80 పరుగులు చేశాడని, దీంతో తాము ఓడిపోయామనుకున్న సిరీస్‌ ను గెల్చుకున్నామని దాదా తెలిపారు. ఆ విజయం తనను మార్చి, మంచి ఆటగాడిగా, జట్టుకు సారథిగా తీర్చిదిద్దిందని గంగూలీ తెలిపాడు. 

More Telugu News