west indies: హతవిధీ!... విండీస్ క్రికెటర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారారు!

  • పేస్ బౌలింగ్ తో విరుచుకుపడే వెస్టిండీస్
  • బ్యాటింగ్ లో వెస్టిండీస్ నుంచి దిగ్గజాలు
  • స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేకపోయిన వెస్టిండీస్

క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్‌ చరిత్రేవేరు. విండీస్ పేరు వింటేనే ప్రత్యర్థులు హడలిపోయేవారు. ఆరడుగుల ఆజానుబాహులు, యుద్ధం చేస్తున్నారా? అన్నంత భయంకరంగా ఆడే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. తలలు పగులగొట్టే బౌన్సర్లు, మెడలు విరిచేసే బీమర్లు, కాళ్లు విరిగిపోతాయనిపించే యార్కర్లతో ప్రత్యర్థిని ఆందోళనకు గురి చేసేవారు.

బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా విండీస్ జట్టుకు సరితూగే ఆటగాళ్లే లేనంతగా దశాబ్దాలపాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన జట్టది. బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా రికార్డులన్నీ ఆ జట్టువే. అలాంటి జట్టు గత వైభవాన్ని కోల్పోయింది. విండీస్ ఆటగాళ్లు నిలకడగా ఆడి, జట్టుగా విజయాలు సాధించి చాలా కాలమే అయింది. దీంతో క్రికెట్ చరిత్రలో తొలిసారి నేరుగా ప్రపంచకప్‌ కు అర్హత సాధించలేకపోయింది.

దీంతో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌ టోర్నీలో పసికూనలతో ఆడనుంది. ఈ క్వాలిఫయర్స్‌ ఆడుతున్న అతి పెద్ద జట్టు విండీసే కావడం విశేషం. సాధారణంగా వరల్డ్ కప్ లో 10 జట్ల కంటే ఎక్కువ జట్లు పోటీపడేవి. 2007లో 16 జట్లు, 2011, 2015ల్లో 14 జట్లు వరల్డ్ కప్ కు ప్రాతినిధ్యం వహించాయి. మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం ఈసారి టోర్నీలో 10 జట్లే పాల్గొననున్నాయి.

ఆతిథ్య హోదాలో ఇంగ్లాండ్‌ తో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్‌-7 జట్లు నేరుగా వరల్డ్ కప్ లో ఆడే అర్హత పొందాయి. మిగిలిన మూడు స్థానాల కోసం అర్హత టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో వరల్డ్ కప్ లో స్థానం కోసం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఏ గ్రూప్ లో వెస్టిండీస్, జింబాబ్వే, అఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఈ పోటీల్లో టాప్ 3 జట్లు వరల్డ్ కప్ లో ఆడుతాయి. గేల్ వంటి స్టార్లున్న విండీస్ పసికూనలతో పోటీపడాల్సిన దుస్థితికి చేరడంపై క్రికెట్ అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి జట్టు ఎలా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News