Sachin Tendulkar: డుమ్మా మాస్టర్... 29 రోజులు మాత్రమే రాజ్యసభకు హాజరైన సచిన్ టెండూల్కర్!

  • ఈ నెలాఖరుతో ముగియనున్న సచిన్ రాజ్యసభ పదవీకాలం
  • సమావేశాల్లో హాజరు శాతం 7.3 మాత్రమే
  • సీనియర్ నటి రేఖ పరిస్థితి మరీ ఘోరం
  • 397 రోజుల సభలో హాజరు 18 రోజులే

భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్ గా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న భారతరత్న సచిన్ టెండూల్కర్, రాజ్యసభ విషయంలో మాత్రం డుమ్మా మాస్టర్ గా చరిత్రలో నిలిచిపోయారు. 2012లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన, అప్పటి నుంచి ఆరేళ్లపాటు ఎంపీగా పదవిలో ఉండి ఈ నెలాఖరులో పదవీ కాలాన్ని ముగించుకోనున్న సంగతి తెలిసిందే.

ఈ ఆరేళ్ల కాలంలో మొత్తం 397 రోజులు రాజ్యసభ జరుగగా, సచిన్ కేవలం 29 రోజులు మాత్రమే సభకు హాజరుకావడం గమనార్హం. ఇందుకుగాను జీత భత్యాల రూపంలో ఆయన పొందిన మొత్తం రూ. 86,23,266. సచిన్ మొత్తం 22 ప్రశ్నలను రాజ్యసభ వేదికగా సంధించాడు. ఆయన హాజరు శాతం 7.3 మాత్రమే. సచిన్ రాజ్యసభలో ఒక్క బిల్లును కూడా ప్రవేశపెట్టలేదు.

ఇక సచిన్ తో పాటే రాజ్యసభలో అడుగుపెట్టిన బాలీవుడ్ సీనియర్ నటి రేఖ పనితీరు మరీ అధ్వానం. 397 రోజులకు గాను రేఖ కేవలం 18 రోజులు మాత్రమే సభకు హాజరయ్యారు. ఆమె అందుకున్న జీత భత్యాల మొత్తం రూ. 99,59,178. ఒక్క ప్రశ్న కూడా ఆమె అడగలేదని రాజ్యసభ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో వివిధ రంగాల్లో పేరుతెచ్చుకున్నారు కదా అని ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల దేశానికి, ప్రజలకు ఒరిగిన ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

More Telugu News