guntur: ప్రత్యేక హోదాపై జగన్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి: వైసీపీ నేత ఆళ్ల నాని

  • ఏపీ ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారు
  • చంద్రబాబు లాంటి సీఎం ఉండటం దురదృష్టకరం
  • ఢిల్లీలో ధర్నాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతాం : నాని

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని వైసీపీ నేత ఆళ్ల నాని అన్నారు. ఈరోజు ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై వివిధ రాజకీయ పార్టీలు కలసి గుంటూరులో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆళ్ల నాని మాట్లాడుతూ, ఏపీ ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని, చంద్రబాబు లాంటి సీఎం ఉండటం దురదృష్టకరమని విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని, ఆ దమ్ము తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఉందా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో తలపెట్టనున్న ధర్నాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామని అన్నారు.  

ఏపీని మరోసారి  మోసం చేయాలని చూస్తున్నాయి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ, విభజన హామీలు ఏ ఒక్కటీ నెరవేరలేదని, టీడీపీ-బీజేపీ కలిసి ఏపీని మరోసారి  మోసం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఏపీ బంద్ తర్వాత, ప్రత్యేక హాదా గురించి టీడీపీ మాట్లాడుతోందని అన్నారు.

 రేపు జాతీయ రహదారుల దిగ్బంధం

ప్రత్యేక హోదా సాధన కోసం రేపు జాతీయ రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 5న ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుపై కేసులు పెడతామని, 6,7 తేదీల్లో ఆత్మగౌరవ దీక్షలు, 8వ తేదీన పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు.

More Telugu News