Red boa: ఆ పాము సిరులను పండిస్తుందంటున్న జనాలు.. కొట్టిపారేస్తున్న అటవీ శాఖాధికారులు!

  • రక్తపింజరికి అతీంద్రియ శక్తులున్నాయని మూఢ నమ్మకం
  • ఎంత బరువుంటే అంత మేలనే ప్రచారం
  • అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్న అధికారులు

రక్తపింజరి పాముకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, అది మీ ఇంట ఉంటే సిరిసంపదలకు కొదవే ఉండదనే ప్రచారం ఇటీవల కాలంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జనాలు వాటిని కొనుగోలు చేసేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. చివరికి అడవిదొంగలను కూడా ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదే అదనుగా పాములను పట్టడంలో నిపుణులైన జాతి వారు వాటికి డిమాండ్‌ను విపరీతంగా పెంచేస్తున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ పాముపై జనాల నమ్మకాన్ని 'ట్రాష్' అని కొట్టిపారేస్తున్నారు.

వన్యమృగ ప్రత్యేక సంరక్షణ అధికారి ఎ.శంకరన్ అందించిన వివరాల ప్రకారం, ప్రజల్లోని అనేక మూఢవిశ్వాసాల్లో రక్తపింజరి పాముకు సంబంధించినది ఒకటి. ఇది తమ ఇంట్లో ఉంటే సిరిసంపదలు కలుగుతాయని నమ్ముతున్న వారు ఎలాగైనా సరే దానిని ఓ పెంపుడు జీవి మాదిరిగా పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. జనాల నుంచి వస్తున్న డిమాండ్‌ను వేటగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఈ పాములకు వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అది ఎంత ఎక్కువ బరువుంటే అంత ఎక్కువగా అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుందనే ప్రచారం కూడా మరోవైపు వేగంగా విస్తరిస్తోంది.

మూడు కిలోల కంటే ఎక్కువ బరువుంటే దానికి ఎక్కువగా అతీంద్రియ శక్తులు ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల పాము బరువును బట్టి దాని రేటును నిర్ణయిస్తున్నారు. ఈ పాములకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో వీటి విక్రయానికి 'ఆన్‌లైన్'ను ఎంచుకోవడం షాక్‌ను కలిగించే విషయం. ఈ నేపథ్యంలో శంషాబాద్‌కు చెందిన వన్యమృగ సంరక్షణ సంఘం సభ్యులు అందించిన సమాచారంతో అటవీ శాఖ అధికారులు వేటగాళ్ల ఆటకట్టించేందుకు, ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు రంగప్రవేశం చేశారు. పాముల విక్రయానికి పాల్పడుతున్న వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలానికి చెందిన ఉదయ్ కుమార్, రమేశ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గత రెండు నెలలుగా ఈ వ్యవహారం తమకు పెద్ద తలనొప్పిగా మారిందని వన్యమృగ సంరక్షణ అధికారి మునీంద్రా చెప్పారు.

More Telugu News