Brahmins: మత సామరస్యానికి ఇంతకన్నా నిదర్శనమా...?

  • మసీదు నిర్మాణానికి స్థలం దానమిచ్చిన బ్రాహ్మణులు
  • డబ్బులు సమకూర్చిన సిక్కులు..శ్రమదానం కూడా
  • మతసామరస్యానికి ప్రతీకగా పంజాబ్‌లోని మూమ్ గ్రామం

ఓ మసీదు కోసం బ్రాహ్మణులు స్థలమివ్వగా, దాని నిర్మాణానికి సిక్కులు డబ్బులు సమకూర్చారు. అంతేకాదు, ఆ రెండు మతస్థులు మసీదు నిర్మాణానికి శ్రమదానం కూడా చేస్తున్నారు. పంజాబ్‌లోని బర్నాలా జిల్లా, మూమ్ గ్రామంలో ఈ అద్భుతమైన మత సామరస్య దృశ్యం గోచరిస్తోంది. మత సామరస్యానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది.

 ఈ మసీదు నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్న 40 ఏళ్ల నజీమ్ ఖాన్ మాట్లాడుతూ..."ఇప్పటివరకు, మా గ్రామంలోని బాబా మొమిన్ షా మందిరం లోపల ఉన్న రెండు గదుల్లో ప్రార్థనలు చేస్తున్నాం. పండిట్ బిరదారీ కొంత స్థలాన్ని మసీదు కోసం దానం చేయడంతో మేము నిర్మాణాన్ని మొదలుపెట్టాం. వారు స్థలాన్ని ఇవ్వడమే కాకుండా మసీదు నిర్మాణానికి తమ వంతుగా శ్రమదానం చేస్తున్నారు. డబ్బులు కూడా సమకూర్చుతున్నారు" అని ఆయన సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ మసీదు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న సదరు గ్రామంలో ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్న పండిట్ పురుషోత్తం లాల్ మాట్లాడుతూ, ఓ పంజాబీగా, తమకు సంబంధించినంత వరకు మతాలకు అతీతంగా అందరూ సమానమేనని ఆయన అన్నారు. రాజకీయ నేతలు ఓట్ల కోసం మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారని, కానీ తాము వారి వలలో పడబోమని మూమ్ గ్రామస్థుడొకరు స్పష్టం చేశాడు. దాదాపు 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ గ్రామానికి శాంతియుత జీవనం, మత సామరస్యత పరంగా గొప్ప చరిత్ర, పేరు ఉన్నాయి.

More Telugu News