Sridevi: కేసు తేలితే కానీ శ్రీదేవి భౌతికకాయం భారత్ కు రాదా?

  • శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన శ్రీదేవి
  • శ్రీదేవి మృతిపై ఎన్నో అనుమానాలు
  • ఆమె మృతిపై సందేహాలు తీరిన తరువాతే మృతదేహం అప్పగింత

 దుబాయ్‌ లోని జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌ లో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన శ్రీదేవి భౌతికకాయం ఇంకా భారత్ కు చేరని సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతి వెనుక కారణాలను వెలికి తీస్తున్న పోలీసులు, దర్యాప్తు కొలిక్కి రాకుండా భౌతిక కాయాన్ని భారత్ కు పంపే అవకాశం లేనట్టు తెలుస్తోంది. నేడు బోనీకపూర్ ను విచారించిన తరువాత దీనిపై ఒక స్పష్టత రానున్నట్టు సమాచారం.

ఈ కేసు ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎంబామింగ్ (మృతదేహం పాడవకుండా రసాయనాలతో జరిపే ప్రక్రియ) కూడా ఇంకా పూర్తికానట్టు తెలుస్తోంది. అయితే అన్ని సందేహాలు తీరిన తరువాతే ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందిస్తామని పోలీసధికారులు భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

ఇక శ్రీదేవి మరణంపై బోనీకపూర్ కుటుంబం నుంచి ఖలీజా టైమ్స్ కు సంజయ్ కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూ మినహా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కుటుంబ సభ్యులు కనీసం ఆమె అంత్యక్రియలకు సంబంధించిన ప్రకటన కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె భౌతికకాయం ఇప్పట్లో భారత్ కు వచ్చే అవకాశం లేదా? వస్తే ఎప్పుడొస్తుందన్న ఆందోళన ఆమె అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ఆమె భౌతిక కాయాన్ని ఇండియాకు తరలించేందుకు దుబాయ్ వెళ్లిన రిలయన్స్ విమానం అక్కడే ఉంది. 

More Telugu News