Sridevi: శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్ నుంచి శ్రీదేవిగా.. అతిలోక సుందరి సినీ ప్రస్థానం!

  • నాలుగేళ్ల వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి..
  • తెలుగు, తమిళ, హిందీలోని అగ్రహీరోలందరితోనూ నటించిన శ్రీదేవి
  • 2013లో ‘పద్మశ్రీ’తో గౌరవించిన భారత ప్రభుత్వం

బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13, 1963న జన్మించారు. అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. 1967లో అంటే నాలుగేళ్ల వయసులోనే ‘కనదన్ కరుణాయ్’ అనే చిత్రంలో బాలనటిగా తొలిసారి నటించింది. 1976లో దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘మాండ్రు ముడిచు’ అనే సినిమాలో కమలహాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించింది. ఈ సినిమాతో శ్రీదేవి ప్రభ వెలిగిపోయింది. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

తెలుగులో ‘పదహారేళ్ల వయసు’, హిందీలో ‘సోల్వా సావన్’లలో తొలిసారి హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక దశలో తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలను ఏలారు. 1975-85 మధ్య కాలంలో టాలీవుడ్, కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అగ్ర హీరోలందరితోనూ శ్రీదేవి నటించారు.

అంతేకాదు.. రెండు తరాల హీరోలతో నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఆమెను సినీ లోకం ముద్దుగా ‘అతిలోక సుందరి’గా పిలుచుకుంటుంది. బోనీకపూర్‌తో వివాహం తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన శ్రీదేవి 2012లో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమా ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటీవల ‘మామ్’ అనే సినిమాలోనూ నటించారు. శ్రీదేవి తన నటప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 2013లో భారత అత్యున్నత పౌరపురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ని అందుకున్నారు. నాలుగుసార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీ అవార్డులను శ్రీదేవి అందుకున్నారు. తెలుగులో వెంకటేశ్ సరసన నటించిన ‘క్షణక్షణం’ చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు.  

54 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో ఆమె మరణించారన్న వార్తను సినీ ప్రపంచమే కాదు, అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమాన నటి మరణవార్త తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు. ఆమె మృతికి పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

More Telugu News