Hyderabad: డ్రంకెన్ డ్రైవ్ సిత్రాలు... ఓ యువతి పారిపోతే, మరో యువతి ప్రశ్నించింది!

  • వీకెండ్స్ లో కొనసాగుతున్న తాగుబోతుల ఆగడాలు
  • మగవాళ్లతో పోటీపడి తాగుతున్న మగువలు
  • శుక్రవారం నాడు పట్టుబడ్డ 79 మంది

హైదరాబాద్ లో తాగుబోతు డ్రైవర్స్ ఆగడాలు కొనసాగుతున్నాయి. కేవలం మగవారే కాదు, ఆడవాళ్లు కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. వారాంతం వస్తే చాలు పబ్బుల్లో పూటుగా మందుకొట్టి, రోడ్డెక్కుతున్నారు. అది కూడా వాహనాలు నడుపుకుంటూ. ఈ క్రమంలో మందు కొట్టి వాహనం నడిపే మందుబాబుల సంఖ్యను తగ్గించాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం సఫలీకృతం కావడంలేదు. గత రాత్రి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలో డ్రైంకెన్ డ్రైవ్ నిర్వహించగా, మొత్తం 79 మంది తాగుబోతులు పట్టుబడ్డారు. 49 బైకులు, 27 కార్లు, 3 ఆటోలను సీజ్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

కాగా, జూబ్లీహిల్స్ లో తనిఖీల్లో పట్టుబడిన ఓ యువతి తాను మందు కొట్టలేదని, బ్రీత్ ఎనలైజర్ తప్పుగా చూపుతోందని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తప్పుడు మెషీన్ తెచ్చి తన పరువు తీస్తున్నారని మండిపడింది. కాసేపు వాగ్వాదం తరువాత, మరో అనలైజర్ తెచ్చి ఆమెకు పరీక్షలు చేసి, తప్పు ఒప్పుకోకుంటే మరో సెక్షన్ కూడా జోడించాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో మరేమీ మాట్లాడలేదు. ఇక, తాను వెళ్లేదారిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయని పసిగట్టిన మరో యువతి కారును రోడ్డుపై అడ్డంగా నిలిపేసి పరారైంది. రోడ్డుకు అడ్డంగా కారు ఆగిపోవడంతో చాలాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలుగగా, పోలీసులు క్రేన్ సాయంతో దాన్ని తొలగించారు.

More Telugu News