justin trudeau: పాపం కెనడా ప్రధాని! పట్టించుకోని మోదీ.. ఒంటరిగానే పర్యటన.. కారణం అదేనా?

  • భారత్‌లో వారం రోజుల పర్యటనకు వచ్చిన ట్రూడో
  • పర్యటనలో కనిపించని మోదీ 
  • ముఖం చాటేసిన కేంద్రమంత్రులు
  • సర్వత్ర చర్చనీయాంశం

భారత పర్యటనకు వచ్చే విదేశీ నేతలకు హగ్ (ఆలింగనం) ఇచ్చి ఆహ్వానం పలికే భారత ప్రధాని నరేంద్రమోదీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు మాత్రం ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది. కెనడాతో పోలిస్తే చాలా చిన్నదేశం అయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల భారత్ వచ్చినప్పుడు విమానాశ్రయంలో ఆయనను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అయితే భారత్‌తో వందేళ్లకుపైగా సంబంధాలున్న కెనడా ప్రధానికి మాత్రం ఆ ఆలింగనాలు లేవు.. ఆయన ఊసూ లేదు. ఇక ట్రూడో వెంట కేంద్రమంత్రులు కూడా కనిపించకపోవడం గమనార్హం.

తాజ్‌మహల్, స్వర్ణదేవాలయం, సబర్మతీ ఆశ్రమాన్ని జస్టిన్ ట్రూడో భార్య, ముగ్గురు పిల్లలతోనే సందర్శించారు. వారం రోజుల అధికారిక పర్యటనకు వచ్చిన ఆయన విషయంలో ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కారణాలు వెతికి చూడగా, తీవ్రవాద మద్దతుదారులైన సిక్కు గ్రూపులతో ట్రూడో సర్కారు చనువుగా ఉండడమే కారణమని తెలుస్తోంది.

సిక్కుల్లోని తీవ్రవాద శక్తులతో ట్రూడో సర్కారు అంటకాగుతోందని, వారికి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ప్రధాని మోదీతోపాటు పంజాబ్ సర్కారు కూడా భావిస్తోంది. ఈ కారణంగానే మోదీ ఆయనకు దూరంగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్ ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా సిక్కుల్లో కొందరు మద్దతు ఇవ్వడాన్ని భారత్ జీర్ణించుకోలేకపోతోంది. ఇందిరాగాంధీ మరణానంతరం చెలరేగిన అల్లర్లలో దేశంలో మూడువేల మంది సిక్కులను చంపడాన్ని కెనడా పార్లమెంటు ‘మారణకాండ’గా అభివర్ణించింది. ఈ పరిణామాలన్నీ భారత్‌కు నచ్చడం లేదు. ఈ కారణంగానే ట్రూడో పర్యటనలో అటు ప్రధాని మోదీ, ఇటు మంత్రులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.  

More Telugu News