Tamilnadu: కదిలిన కమలహాసన్... తమిళ రాజకీయాల్లో కొత్త శకం!

  • రామేశ్వరం నుంచి కమల్ రాజకీయ యాత్ర
  • నేడు పలు ప్రాంతాల్లో సభలు
  • సాయంత్రం మధురైలో పార్టీ పేరు, జెండా వివరాల ప్రకటన
  • సభకు ముఖ్య అతిథిగా రానున్న కేజ్రీవాల్

తమిళనాడు రాజకీయాల్లో నవశకం ప్రారంభమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలతో పాటు ఎండీఎంకే, డీఎండీకే వంటి చిన్నా చితకా పార్టీలు ఉండగా, అపారమైన అభిమాన బలమున్న విలక్షణ నటుడు కమలహాసన్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ ఉదయం రామేశ్వరంలోని అబ్దుల్ కలామ్ స్వగృహం నుంచి ఆయన తొలి అడుగు వేశారు. కలామ్ కు నివాళులు అర్పించిన ఆయన, రామేశ్వరం, పరమకొడి, మధురై ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు చివరిగా జరిగే మధురై సభలో తన పార్టీ పేరు, జెండా తదితర వివరాలను కమల్ స్వయంగా వెల్లడించనున్నారు.

ఇప్పటికే కమల్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ కలసి చర్చించిన సంగతి తెలిసిందే. బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే కమల్ సమావేశాలు నిర్వహించడాన్ని పరిశీలిస్తుంటే, ఆయన కేంద్రంలోని అధికార కూటమికి సాధ్యమైనంత దూరంగానే ఉంటారన్న సంకేతాలు వెలువడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, నేడు కమల్ మధురైలో నిర్వహించే సభకు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా పాల్గొననుండటం గమనార్హం. దీంతో ఈ సభను కవర్ చేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ మీడియా సంస్థలకూ ఆహ్వానాలు అందాయి. ఢిల్లీ, కోల్ కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి కూడా వార్తాసంస్థల ప్రతినిధులు ఇప్పటికే మధురై చేరుకున్నారని తెలుస్తోంది. ఆయన పార్టీపై ఇప్పుడు తమిళ తంబీలు చర్చించుకుంటున్నారు.

More Telugu News