India: నరేంద్ర మోదీ విమానానికి రూటు చూపించడానికి పాక్ బిల్లు!

  • పాక్ గగనతలం మీదుగా ఎగిరిన మోదీ విమానాలు
  • దారిచ్చినందుకు డబ్బు తీసుకున్న పాకిస్థాన్
  • సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు వెల్లడి

భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానాలకు తమ గగనతలం మీదుగా రూటు చూపించినందుకు పాకిస్థాన్ రూ. 2.86 లక్షలను చార్జ్ చేసింది. భారత వాయుసేన విమానాల్లో ప్రయాణించే వేళ అయిన ఖర్చులకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని రిటైర్డ్ నేవీ ఆఫీసర్ లోకేష్‌ బత్రా సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించగా, ఈ వివరాలు అందాయి. జూన్ 2016 వరకూ ఆయన 11 దేశాల్లో పర్యటించేందుకు భారత వాయుసేన విమానాలను మోదీ వినియోగించారు.

 రష్యా, ఆఫ్గనిస్థాన్ లకు వెళ్లి వస్తున్నప్పుడు, లాహోర్ లో దిగి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసినప్పుడు విమానాలకు మార్గం చూపినందుకు రూ. 1.49 లక్షలను పాక్ వసూలు చేసింది. ఇక ఇరాన్ పర్యటనకు వెళ్లినప్పుడు రూ. 77,215, ఖతార్ వెళ్లినప్పుడు రూ. 59,215ను పాక్ వైమానిక శాఖ వసూలు చేసినట్టు లోకేష్ బత్రాకు సమాచారం అందింది. మొత్తం మీద ఆయన విదేశీ పర్యటనలకు రూ. 2 కోట్లు ఖర్చయినట్టు కూడా వాయుసేన పేర్కొంది.

More Telugu News