RBI: ప్రతీ నాలుగు గంటలకు ఓ బ్యాంకు ఉద్యోగి మోసానికి పాల్పడుతున్నాడు.. రిజర్వు బ్యాంకు చెబుతున్నది ఇదే!

  • రెండేళ్లలో 5200 మంది బ్యాంకు ఉద్యోగులకు శిక్ష
  • మొదటి స్థానంలో స్టేట్ బ్యాంకు
  • వెల్లడించిన ఆర్బీఐ నివేదిక
  • మోసాల డేటాను సేకరిస్తున్న రిజర్వు బ్యాంకు

దేశంలో ప్రతీ నాలుగు గంటలకు ఓ బ్యాంకు ఉద్యోగి మోసం కేసులో పట్టుబడుతున్నట్టు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) డేటా ద్వారా తెలుస్తోంది. జనవరి 1, 2015 నుంచి మార్చి 31, 2017 వరకు మొత్తం 5,200 మంది బ్యాంకు ఉద్యోగులు మోసం కేసులో శిక్షకు గురయ్యారు. వీరందరూ ఆయా కేసుల్లో దోషులుగా తేలి శిక్షకు గురైనవారేనని ఆర్బీఐ నివేదిక చెబుతోంది. ఇటువంటి కేసులకు సంబంధించిన డేటాను 2017 నుంచి ఆర్బీఐ సేకరిస్తోంది.

దోషులుగా తేలిన 5,200 మంది బ్యాంకు ఉద్యోగుల్లో 1,538 మంది భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)కి చెందిన వారు కాగా, ఐవోబీ ఉద్యోగులు 449 మంది, సెంట్రల్ బ్యాంకు నుంచి 406, యూనియన్ బ్యాంకు నుంచి 214, పీఎన్‌బీ నుంచి 184, 22 ఇతర పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 2,409 మంది ఉన్నారు. మోసం కేసుల్లో వేలాదిమంది బ్యాంకు ఉద్యోగులు పట్టుబడుతుండడం, శిక్షలకు గురవుతుండడంతో ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి వారిపై ఓ కన్నేసేలా ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తయారుచేసుకోవాలంటూ అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్‌లు పంపింది.

More Telugu News