Shoaib Akhtar: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో రెండు కీలక పదవులు.. నాడు తిట్టిపోసిన వ్యక్తితోనే నేడు ‘రెండో ఇన్నింగ్స్’!

  • పీసీబీ బ్రాండ్ అంబాసిడర్, సలహాదారుగా నియామకం
  • అక్తర్ కెరీర్ మొత్తం వివాదాల సుడిగుండంలోనే
  • నాడు నాజంతో అక్తర్‌కు తీవ్ర విభేదాలు
  • పాక్ క్రికెట్‌ను సర్వనాశనం చేస్తున్నాడని ఆరోపణలు

పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌(42)కు పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) లో రెండు కీలక పదవులు లభించాయి. పీసీబీ బ్రాండ్ అంబాసిడర్‌తోపాటు చైర్మన్ అడ్వైజర్‌గా షోయబ్‌ను నియమించినట్టు పీసీబీ అధ్యక్షుడు నాజం సేథీ ప్రకటించారు. విషయం తెలిసిన అక్తర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది తనకు దక్కిన గౌరవంగా పేర్కొన్నాడు.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. తాను క్రికెటర్‌గా ఉన్నప్పుడు ఎవరితోనైతే గొడవలు పడ్డాడో ఇప్పుడు ఆయనే షోయబ్ నియామకాన్ని ప్రకటించడం. నాజంతో షోయబ్ పలుమార్లు విభేదించాడు. నాజం పీసీబీ చైర్మన్‌‌గా ఉంటూ పాక్ క్రికెట్‌ను సర్వ నాశనం చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశాడు. అలాగే, షోయబ్ కెరీర్ మొత్తం ఒడిదొడుకుల మధ్యే సాగింది.

ఫామ్ కోల్పోవడంతో 2005లో ఆస్ట్రేలియా సిరీస్‌కు షోయబ్‌ను పక్కనపెట్టారు. 2006లో నిషేధిత డ్రగ్స్ (ఉత్ర్పేరకాలు) వాడి అడ్డంగా దొరికిపోయాడు. 2008లో అక్తర్‌ను పీసీబీ నిషేధించింది. పాక్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు 15 టీ20లు ఆడిన షోయబ్ 444 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్నాడు.

More Telugu News