US Senate: అమెరికా సెనేట్‌లో ఇమిగ్రేషన్ బిల్లులకు బ్రేక్... డ్రీమర్ల పరిస్థితి అగమ్యగోచరం!

  • కీలక సవరణలకు అమెరికా ఎగువసభ మోకాలడ్డు
  • లక్షలాది మంది డ్రీమర్లు స్వదేశానికి వెళ్లాల్సిన ముప్పు!
  • 25 బిలియన్ డాలర్లతో మెక్సికో వెంట గోడ నిర్మాణానికి ఓకే

లక్షలాది మంది 'డ్రీమర్ల'ను అయోమయంలో పడేసేలా అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువసభ 'సెనేట్' ఇమిగ్రేషన్ చట్టానికి చేసిన కొన్ని కీలకమైన సవరణల ఆమోదానికి ససేమిరా అంది. ఈ చర్యతో ప్రవాస భారతీయులకు లబ్ధి చేకూర్చే చర్యల అమలుకు అడ్డుకట్ట పడినట్లయింది. సెనేటర్లు తిరస్కరించిన వాటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రతిపాదన కూడా ఉండటం గమనార్హం. సెనేట్‌లో చర్చ సందర్భంగా ట్రంప్ ప్రభుత్వం 18 లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం కల్పించేందుకు అంగీకరిస్తూ ఓ ప్రతిపాదన చేసింది.

అయితే ఈ ప్రతిపాదనకు సెనేటర్లు అంగీకరించలేదు. ట్రంప్ మద్దతుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లు సెనేట్‌లో 39-60 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఫలితంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాం నాటి డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ ఎరీవల్స్ (డీఏసీఏ) ప్రోగ్రామ్ కింద నమోదైన 690,000 మంది డ్రీమర్లతో పాటు డీఏసీఏ కింద నమోదు కాకపోయినా అర్హులైన మరో 1.1 మిలియన్ల మంది మార్చి 5 తర్వాత స్వదేశాలకు బలవంతంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వీసాల జారీలో లాటరీ విధానం రద్దు సహా దేశాల వారీగా గ్రీన్ కార్డుల సంఖ్య పరిధి ఎత్తివేతకు సంబంధించిన బిల్లులను కూడా సెనేట్ తిరస్కరించడంతో ప్రవాస భారతీయులకు నిరాశ ఎదురయింది.

కాగా, అమెరికా వలస విధానంలో కీలక సంస్కరణలకు ఉద్దేశించిన మొత్తం నాలుగు బిల్లులను సెనేట్ తిరస్కరించింది. సెనేట్ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సవరణ ఆమోదం పొందలేకపోయిందని రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో అన్నారు. ఈ విషయంలో 2013 నుంచి తాము కృషి చేస్తున్నామని, ఇమిగ్రేషన్ విధానానికి ఎక్కువగా సవరణలను ఒకేసారి ప్రతిపాదిస్తే అవి ఆమోదం పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పోతే, మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి 25 బిలియన్ డాలర్ల ఖర్చు చేసేందుకు మాత్రం ఒప్పుకుంది.

More Telugu News