China: ఆ ప్రాంతం మాది.. అక్కడ మీరెలా పర్యటిస్తారు?: మోదీ అరుణాచల్ పర్యటనపై చైనా ఆగ్రహం

  • అరుణాచల్‌ప్రదేశ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన
  • వివాదాస్పద ప్రాంతంలో పర్యటనలేంటంటూ చైనా ఆగ్రహం
  • సరిహద్దు సమస్యల పరిష్కారం  కోసం చర్చలు అవసరమన్న డ్రాగన్ కంట్రీ

అరుణాచల్‌ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రధాని నరేంద్రమోదీ గురువారం అరుణాచల్‌ప్రదే‌శ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చైనా ఆగ్రహానికి ఇది కారణమైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు దక్షిణ టిబెట్‌లో భాగమని వాదిస్తున్న చైనా దీనిని వివాదాస్పద ప్రాంతమని చెబుతోంది. దీంతో మోదీ ఇక్కడ పర్యటించడాన్ని వ్యతిరేకించింది. భారత్-చైనా సరిహద్దు విషయంలో తాము ఎప్పుడూ ఒకేలా ఉంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ పేర్కొన్నారు. మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించడంపై దౌత్యపరమైన నిరసన చేపడతామన్నారు.

సరిహద్దులోని కొన్ని ప్రాంతాలు తమవేనని, అవి అరుణాచల్‌ప్రదేశ్‌విగా తామెప్పుడూ గుర్తించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో భారత అధికారులు పర్యటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో ఇరు దేశాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉందని జెంగ్ షువాంగ్ అన్నారు. సరిహద్దు విషయంలో ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందన్నారు. భారత్ కూడా దీనికి కట్టుబడితే మంచిదని, లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు.  

కాగా, అరుణాచల్‌ప్రదేశ్, ఇటానగర్‌లో సివిల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌ను మోదీ ప్రారంభించారు. టోమో రిబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ భవనంలో అకడమిక్ బ్లాక్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.

More Telugu News