ap budget: 'ఆ విధంగా ఏపీ బడ్జెట్ ఉండాలి'.. ఏపీ మంత్రులు యనమల, సోమిరెడ్డి, నారాయణ సూచనలు

  • గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం పెరగాలి
  • ప్రతి శాఖలో రెవెన్యూ వ్యయం తగ్గించుకొని, స్థిరాస్తి వ్యయం పెంచుకోవాలి
  • వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత
  • పది వేల గ్రామాల్లో 26 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంపు

గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం పెరిగే విధంగా రాష్ట్ర‌ బడ్జెట్ రూపొందించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం వ్యవసాయం దాని అనుబంధ శాఖలు, మార్కెటింగ్, పశుసంవర్ధక, సహకార శాఖలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, వ్యవసాయం అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి గ్రామీణ ప్రజల ఆదాయం పెరగాలన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ వాటాకు అన్ని శాఖల వారు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే ఇంటింటికి జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులకు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతి శాఖలో రెవెన్యూ వ్యయం తగ్గించుకొని, స్థిరాస్తి వ్యయం పెంచుకోవాలన్నారు. చాలా శాఖల వారు ఇచ్చిన బడ్జెట్ ఖర్చు చేయకుండా అదనపు బడ్జెట్ అడగటం మొదలుపెట్టారని, ఇది బడ్జెట్ మేనేజ్ మెంట్ కు విరుద్ధ‌మని పేర్కొన్నారు.

ప్రతి శాఖలో ప్రాధాన్యతను బట్టి కేటాయింపులను ఇతర పథకాలకు ఖర్చు చేసుకునే అవకాశం కల్పించామని, ఆ విధంగా నిధులు వినియోగించుకోవాలని యనమల సూచించారు. ప్రతి శాఖలోని సిబ్బందిని హేతుబద్ధీకరించుకొని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వారితో పని చేయించుకోవాలన్నారు. ఎస్సీల భూమి కొనుగోలు పథకానికి తగినన్ని నిధులు కేటాయించాలని సూచించారు. రొయ్యల చెరువులను, వ్యవసాయ భూములను జోన్లుగా విభజించాలని మంత్రి యనమల ఆదేశించారు.

వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి కోరారు. ఈ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. మార్కెటింగ్, పశుసంవర్ధక, సహకార శాఖల మంత్రి సీహెచ్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు రూ.500 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేయమని కోరారు. వెటర్నరీ డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

పట్టణ గృహనిర్మాణం పథకం, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్ట్ వంటి 41 ప్రాజెక్టులు ఉన్నందున తమ శాఖకు అదనపు నిధులు కేటాయించమని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  నారాయణ కోరారు. పౌరులు ప్రభుత్వానికి చెల్లించవలసిన చెల్లింపులన్నిటినీ ఆన్ లైన్, నగదు రూపంలో చెల్లించే నూతన సాఫ్ట్ వేర్ ను ప్రణాళికా శాఖ వారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి చూపించారు.

ఈ విధానంలో చెల్లింపులు ఆన్ లైన్ తోపాటు స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లలో చెల్లించే అవకాశం ఉంది. వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖలలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. వ్యవసాయ రంగంలో జలవనరులు అందుబాటులోకి రావడంతో ఉత్పాదకత పెరిగిందని, ఉద్యానవన పంటలు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. నిల్వ సామర్థ్యం పెరగడంతో కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల కొరత తగ్గిందని చెప్పారు. ఆప్ కాబ్ డిపాజిట్లు, వడ్డీ రాయితీ గురించి ఆ బ్యాంకు అధికారి వివరించారు. పశుసంవర్థక శాఖలో వృద్ధి రేటును ఆ శాఖ అధికారులు తెలిపారు.

పది వేల గ్రామాల్లో 26 వేల ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచుతున్నట్లు వివరించారు. తద్వారా 15 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. మత్స్య శాఖలో వృద్దిరేటుని, మెరైన్, ఇన్ ల్యాండ్ ఉత్పత్తులను, ఆక్వా కల్చర్ లో ప్రవేశపెట్టిన ఆధుని పద్ధతులను అధికారులు మంత్రికి వివరించారు. మన్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు స్మార్ట్ సిటీలు, ఎకనామిక్ సిటీ, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, సాధికార మిత్ర, వడ్డీలేని రుణాలు, అమరావతి మెట్రో రైలు, అన్న క్యాంటిన్లు, పట్టణ గృహ నిర్మాణం, మున్సిపల్ పాఠశాలలు, శ్మశానవాటికల అభివృద్ధి, ఓడీఎప్ ప్లస్ తదితర అంశాలను వివరించారు.

రైతు రుణమాఫీ, రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్ల పంపిణీ, వ్యవసాయ రంగంలో ఖర్చులు తగ్గించవలసిన అవసరం, రొయ్యల చెరువులు, పాడిపశువులు, గొర్రెల కొనుగోలు, వ్యవసాయంలో యాత్రీకరణ, పట్టణీకరణ, కౌలు రైతులకు రుణాలు, ప్రకృతి వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నిష్పత్తి, ఫిషరీస్ యూనివర్సిటీ, బోట్లకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ తదితర అంశాలను చర్చించారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కే వలవన్, మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ పీడీ కొండలరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా ముని వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

More Telugu News