whatsapp: వాట్సాప్ పై పేటీఎం అధినేత గుర్రు... ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటన

  • వాట్సాప్ పేమెంట్స్ తో భద్రతకు ముప్పు
  • ఏటీఎంను తెరిచి చేతికి ఇచ్చినట్టే
  • స్వలాభం కోసం యూపీఐ వ్యవస్థ దుర్వినియోగం
  • పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆరోపణలు

దేశంలోనే అతిపెద్ద చెల్లింపుల కంపెనీ పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ వాట్సాప్ పై మండిపడుతున్నారు. వాట్సాప్ ప్రయోగాత్మకంగా పేమెంట్స్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాట్సాప్ అన్నది కేవలం ఇన్ స్టాల్ చేసుకుని మొబైల్ నంబర్ ఆధారంగా లాగిన్ అయ్యే వేదిక. ఇతరత్రా వివరాలు ఏవీ అవసరం లేదు. దీన్నే శర్మ ప్రశ్నిస్తున్నారు. దీన్ని సెక్యూరిటీ పరంగా ముప్పుగా పేర్కొంటున్నారు. వాట్సాప్ పేమెంట్స్ ను అనుమతిస్తే ఎవరి చేతికైనా తెరిచి ఉన్న ఏటీఎంను ఇచ్చినట్టుగా అభివర్ణించారు.

ఫేస్ బుక్ (వాట్సాప్ యజమాని) బహిరంగంగా మన చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)ను స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని శర్మ ఆరోపిస్తున్నారు. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (యూపీఐను అభివృద్ధి చేసిన సంస్థ)కు ఫిర్యాదు చేస్తానని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని శర్మ చెప్పారు. వాట్సాప్ కు దేశీయంగా 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇంటర్నెట్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కూడా తేజ్ పేరుతో యూపీఐ ఆధారిత చెల్లింపుల కోసం యాప్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

More Telugu News