Hafiz saeed: ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు భారీ షాక్.. నాలుగు ఆసుపత్రులు సీజ్!

  • ముంబై పేలుళ్ల సూత్రధారిపై ఎట్టకేలకు చర్యలు
  • ఉగ్రవాదిగా గుర్తించిన మరుసటి రోజే ఆస్తుల స్వాధీనానికి ఆదేశం
  • నాలుగు ఆసుపత్రులను అధీనంలోకి తీసుకున్న పాక్

ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్‌ను ఇన్నాళ్లూ వెనకేసుకొచ్చిన పాక్ ఎట్టకేలకు కళ్లు తెరిచింది. అమెరికా, ఐక్యరాజ్య సమితి చెప్పినా ఏమాత్రం పట్టించుకోని పాక్ ఇప్పుడు హఫీజ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడు అసలు ఉగ్రవాదే కాదని, చారిటీలతో పాక్ ప్రజలకు సేవ చేస్తున్నాడని ఇప్పటి వరకు వాదించిన పాక్.. ఇప్పుడు అతడిని ఉగ్రవాదిగా గుర్తించింది.

జేయూడీ ఆధ్వర్యంలో నడుస్తున్న సదస్సులు, ఆరోగ్య సదుపాయాలను నిలిపివేస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, అతడి సంస్థలను, ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ‘అకాఫ్’ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఆదేశాలతో జేయూడీ, ఎఫ్ఐఎఫ్ నడుపుతున్న నాలుగు ఆసుపత్రులను అధీనంలోకి తెచ్చుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ తలత్ మొహమూద్ గొండాల్ తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి పాక్‌పై ఒత్తిడి పెరుగుతుండడంతోనే ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. ఆ మరుసటి రోజే అతడి సంస్థలపై చర్యలు తీసుకుంది.

More Telugu News