Child welfare committee (CWC): చెత్తకుండీలో ముద్దులొలికే బోసినవ్వుల పసిపాప.. దత్తత కోసం ప్రజల పోటాపోటీ!

  • మొరాదాబాద్ అనాథాశ్రమానికి పాప అప్పగింత
  • అసలు తల్లిదండ్రులను గుర్తించే పనిలో అధికారులు
  • డీఎన్ఏ పరీక్షల్లో రుజువైతేనే అప్పగింత
  • లేకుంటే రెండేళ్ల తర్వాతే బయటవారికి దత్తత ఛాన్స్

మొరాదాబాద్-ఆగ్రా జాతీయ రహదారిపైన ఓ చెత్త కుండీలో శుక్రవారం ఉదయం గుర్తించిన ఆరు నెలల ఆడ శిశువు కోసం సంతానం లేని జంటలు దత్తత తీసుకోవడానికి పోటీ పడుతున్నారు. అందుకోసం పోలీసులు, పిల్లల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ)ని వారు ఆశ్రయిస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రభుత్వ సంస్థలు ఆ పాపను ఓ అనాథ శరణాలయానికి అప్పగించారు.

తొలుత ఆమె తల్లిదండ్రులెవరో తెలుసుకుంటామని వారు చెప్పారు. పాప ఫొటోలు అటు పలు వార్తాపత్రికల్లోనే కాక సోషల్ మీడియాలోనూ పోస్టు కావడంతో శనివారం ఉదయం నుంచి డజన్లకొలదీ పిల్లలు లేని జంటలు మొరాదాబాద్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయం ఎదుట క్యూ కడుతున్నారు. వారిలో ఆ పాపను గుర్తించి కాపాడిన భికన్‌పూర్-కుల్వాడా గ్రామస్థులు కూడా ఉన్నారు.

మరోవైపు పసిపాప ఎలాగైనా సరే ఆమె తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. పాపను ప్రస్తుతానికి పశ్చిమ యూపీలోని రాంపూర్‌లో ఉన్న ఏకైక అనాథ శరణాలయానికి తరలించామని అధికారులు తెలిపారు. ఈ విషయమై మొరాదాబాద్ సీడబ్ల్యూసీ ప్రెసిడెంట్ గుల్జార్ అహ్మద్ మాట్లాడుతూ,"పాపను దత్తత ఇవ్వమని ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఆఫీసుకు కూడా పిల్లలు లేని జంటలు వస్తూనే ఉన్నారు. అయితే ఆమె తల్లిదండ్రులెవరో ముందు తెలుసుకునే పనిలో ఉన్నాం. ఆమెను ఎవరికీ అప్పగించమని వారికి మేము చెబుతున్నాం" అని ఆయన చెప్పారు.

ఆ పాప మా పాపే అంటూ ఎవరైనా వచ్చినా సరే వారికి ముందుగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని, అక్కడ రుజువుతైనే వారికి అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీలోని మరో సభ్యుడు విన్సెంట్ రామ్ మాట్లాడుతూ, పాప అసలు తల్లిదండ్రులెవరో తెలియకుంటే రెండేళ్ల తర్వాతే ఆమెను ఎవరికైనా దత్తత ఇస్తామని చెప్పారు.

More Telugu News