Jammu And Kashmir: ఆర్మీ మేజర్ పై కశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అంశంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం!

  • ఆర్మీ మేజర్ ఆదిత్య కుమార్ పై పోలీస్ కేసు కొట్టివేయాలి
  • ‘సుప్రీం’లో పిటిషన్ వేసిన ఆదిత్య తండ్రి, లెఫ్టినెంట్ కల్నల్ కరమ్ వీర్ సింగ్
  • సోమవారం విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు

జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ లోని గనోవ్ పొరా గ్రామంలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు ఆర్మీ మేజర్ ఆదిత్య కుమార్ ను బాధ్యుడిని చేస్తూ స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆదిత్య కుమార్ తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ కరమ్ వీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. తన కుమారుడిపై జమ్మూకాశ్మీర్ పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని ఆ పిటిషన్ లో ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

 కాగా, గనోవ్ పొరా గ్రామంలో ఆర్మీ వాహనాలపై దుండగులు రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలను ధ్వంసం చేయడంతో, ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులు మరణించడంతో జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ విచారణకు ఆదేశించదాంతో, ఆర్మీ మేజర్ ఆదిత్య కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

More Telugu News