Supreme Court: అయోధ్య కేసును భూ వివాదంగానే పరిగణిస్తాం!: సుప్రీంకోర్టు

  • ఇది కూడా భూ వివాద కేసేనని సుప్రీంకోర్టు వ్యాఖ్య
  • విచారణకు సిబాల్, దుష్యంత్ గైర్హాజరు
  • కేసు తదుపరి విచారణ మార్చి 14కి వాయిదా

రికార్డుల్లో ఉన్న ఆధారాలను బట్టి రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని ఇతర భూ వివాదానికి సంబంధించిన కేసు మాదిరిగానే పరిగణిస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. 70 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం వల్ల అప్పుడప్పుడు చెలరేగుతున్న ఉద్రిక్తలు, వివాదాస్పద ప్రకటనలు తగ్గుముఖం పట్టే దిశగా కోర్టు ఈ మేరకు పేర్కొనడం గమనార్హం.

కాగా, గత ఏడాది డిసెంబరు 5న ఈ కేసు విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, దుష్యంత్ దవే, రాజీవ్ థావన్‌లు పోటాపోటీగా తమ వాదనలు విన్పించారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఏడాది జులైకి అంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు వాయిదా వేయాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం నాటి కేసు విచారణకు సిబాల్, దుష్యంత్ గైర్హాజరుకావడం గమనార్హం.

"కేసు పరిస్థితి ఎలాంటిదైనా సరే, ఇది కూడా ఓ భూ వివాదం మాత్రమే. ఇరు వర్గాల నుండి విజ్ఞాపనలు, ప్రతి విజ్ఞాపనలు (టైటిల్ దావాలపై అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా) వస్తున్నాయి. అందువల్ల వాదోపవాదాలను చక్కగా అర్థం చేసుకున్న తర్వాత రికార్డుల్లోని ఆధారాలను పరిశీలించి ఈ కేసును మేము ఒక భూ వివాదంగానే పరిగణిస్తాం" అని విచారణ సందర్భంగా మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను మార్చి 14కి వాయిదా వేసింది.

More Telugu News