flesh-eating bacteria: వేళ్లు విరిస్తే బయటపడిన రోగం.. చేతిని తినేసిన బ్యాక్టీరియా!

  • ఆంటోనీ అనే వ్యక్తికి చేతి గాయం నుంచి ఇన్ఫెక్షన్
  • మోచేతి నుంచి వేళ్ల వరకు ఆపరేషన్ చేసి కణజాలాన్ని తొలగించిన వైద్యులు
  • అమెరికాలోని కెంటకీలో ఘటన
  • గాయాల పట్ల, వ్యక్తిగత పరిశుభ్రత అత్యవసరం

మన చేతికో, కాలికో గాయాలైతే.. ఏముంది చిన్న గాయమే కదాని నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ ఆ నిర్లక్ష్యం మనకు కోలుకోలేని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకూ ప్రమాదకరంగా మారుతుంది. అందులోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ గా మారితే..? శరీరాన్ని కొంచెం కొంచెంగా తినేస్తే.. ఇలాంటి ఓ ఘటన అమెరికాలోని కెంటకీలో జరిగింది. 

ఆయన పేరు ఆంటోనీ బాల్ స్టన్.. వయసు జస్ట్ 31 ఏళ్లు. పనిలో ఉన్నప్పుడు వేళ్లు విరవడం ఆయనకు అలవాటు. ఏడాది కిందట ఓ రోజు అలాగే కుడి చేతి వేళ్లు విరుస్తుండగా.. ఒక్కసారిగా నొప్పిగా అనిపించింది. వేలు విరిగిపోయిందేమో అన్నంతగా బాధ కలిగింది. తర్వాత నొప్పి కొద్దిగా తగ్గడంతో ఊరుకున్నాడు. కానీ ఆ రోజు రాత్రయ్యే సరికి ఆంటోనీకి జ్వరం, అలసట, నొప్పులతో బాధపడ్డాడు. ఏదో జ్వరంలే అనుకున్నాడు.

తర్వాతి రోజు నిద్ర లేచేటప్పటికి జ్వరం మరింతగా పెరిగింది. నొప్పి వచ్చిన కుడి చేయి మోచేతి నుంచి వేళ్ల వరకు వాచిపోయి.. నల్లగా మారిపోయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి పరుగెట్టాడు. డాక్టర్లు ఆయనకు పరీక్షలు చేసి ‘నెక్రోటైజింగ్ ఫాసిటిస్’ ఇన్ఫెక్షన్ గా నిర్ధారించారు. వెంటనే అత్యవసర చికిత్స చేయాలని చెప్పి.. మరింతగా పరీక్షలు చేయగా.. ఇన్ఫెక్షన్ అప్పటికే చేతిలోపల వేళ్ల దగ్గరి నుంచి మోచేతిదాకా వ్యాపించినట్లు గుర్తించారు.

‘నెక్రోటైజింగ్ ఫాసిటిస్’ అంటే అర్థం ఏమిటో తెలుసా..? మన శరీరంలోని కండరాలు, చర్మం వంటి మెత్తటి కణజాలం మరణానికి కారణమయ్యే ఇన్ఫెక్షన్. సరిగ్గా చెప్పాలంటే కణజాలాన్ని తినేసే ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. సోకిన కొన్ని గంటల్లోనే శరీరంలోని చాలా భాగానికి విస్తరిస్తుంది.  గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్, క్లెబసెల్లా, క్లొస్ట్రిడియం, ఎస్చెరిచియా కొలి, స్టఫిలోకాకస్ ఆరస్ వంటి బ్యాక్టీరియాలు దీనికి కారణమవుతాయి. వీటినే ‘ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా (మాంసాన్ని తినేసే బ్యాక్టీరియా)’లు అంటారు. ఇందులోనూ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరం.

మరి ఆంటోనీకి ఈ బ్యాక్టీరియా ఎలా సోకిందో తెలుసా..? చేతి వేళ్ల మధ్య ఏదో చిన్న గాయమై.. కొంత వరకు మానింది. మరి ఈయనకు అసలే వేళ్లు విరిచే అలవాటుంది కదా.. అలా వేళ్లు విరుస్తుండగా.. ఆ గాయం లోపల కాస్త పచ్చిగా ఉండిపోయింది. ఇదే సమయంలో స్ట్రెప్టో కాకస్ బ్యాక్టీరియా చేతి వేళ్ల మధ్య గాయం నుంచి లోపలికి చొరబడింది. అంతే.. నొప్పి వచ్చినా బయటికేమీ కనబడడం లేదుగదాని ఆయన ఒక రోజు నిర్లక్షం చేశాడు. ఆ ఒక్క రోజులోనే బ్యాక్టీరియా చేయాల్సింత నష్టం చేసేసింది.

ఆంటోనీ మోచేతి వరకు ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తించిన వైద్యులు.. మోచేతి నుంచి చేతి వేళ్ల వరకు ఆపరేషన్ చేశారు. అంత పొడవునా చేతిని కోసి.. లోపల ఇన్ఫెక్షన్ కు గురైన మాంసం, కణజాలాన్ని తొలగించారు. వారం రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ డాక్టర్లు అతని చిటికిన వేలు తొలగించాల్సి వచ్చింది. మరో రెండు వేళ్లు సరిగా పనిచేయడం లేదు. దాంతో ఏదైనా వస్తువును సరిగా పట్టుకోలేక పోతున్నాడు. 

చివరికి డాక్టర్లు ఏం చెప్పారంటే.. ‘ఆంటోనీ మరింత నిర్లక్ష్యంగానీ చేసి, ఆస్పత్రికి రాకుండా ఉంటే.. చెయ్యి మొత్తం తొలగించాల్సి వచ్చేది. మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి. అందుకే ఇలాంటి వాటి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు..’ అన్నారు.

అటు ఆంటోనీయేమో.. ‘వేళ్లు విరిచినంత మాత్రాన ఇంత పెద్ద సమస్య వస్తుందనుకోలేదు. మొత్తానికి బతికి బయటపడ్డా. ఇంకెప్పుడూ వేళ్లు విరవను..’ అంటున్నాడు.

కానీ వేళ్లు విరవడానికి ఈ ఇన్ఫెక్షన్ కు ఏ సంబంధమూ లేదు. నిజానికి గాయాలను నిర్లక్ష్యం చేయడం, అదే సమయంలో పరిశుభ్రత పాటించక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకడం ఆంటోనీ సమస్యకు కారణం. ముఖ్యంగా డ్రైనేజీల నీటి కలుషితాలు, ఆస్పత్రుల్లో రోగకారక పరిసరాలు ఈ బ్యాక్టీరియాకు నిలయాలు. వ్యాధి నిరోధకత తక్కువగా ఉండడం, మధుమేహం, ఆల్కహాల్, పొగతాగే అలవాట్లు, గాయాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్లు వేగంగా విస్తరిస్తాయి.

డెయిలీ మెయిల్, లైవ్ సైన్స్ వెబ్ సైట్లు ఈ ఘటనను పూర్తి వివరాలతో రిపోర్టు చేశాయి.

More Telugu News