Telangana: కేసీఆర్ లేకుంటే కేటీఆర్, హరీష్ రోడ్డెక్కి కొట్టుకుంటారు!: కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాలున్నాయి
  • జగదీష్ రెడ్డి హత్య కేసుల్లో నిందితుడు
  • ఆరు నెలల తరువాత జగదీష్ రెడ్డి మద్యం అమ్ముకోవాల్సిందే

ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే బావా, బావమరుదులు (కేటీఆర్, హరీష్ రావులు) రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. హరీష్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి డుమ్మా కొట్టి బెంగళూరులో సినిమాకు కేటీఆర్ వెళ్లొచ్చారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు వల్లే టీఆర్ఎస్‌ పార్టీకి నాలుగు ఓట్లు పడుతున్నాయని ఆయన చెప్పారు. ఆరు నెలలు ఆగితే మంత్రి జగదీష్ రెడ్డికి అడ్రస్ ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. ఆ తరువాత ఆయన మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందేనని విమర్శించారు.

 జగదీష్ రెడ్డి అవగాహనా రాహిత్యంతో తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో జగదీష్ రెడ్డి పాత్ర లేనిపక్షంలో కేసీఆర్‌ ను ఒప్పించి కేసును సీబీఐకి సిఫార్సు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ మదన్ మోహన్ రెడ్డి హత్య కేసులో జగదీష్ రెడ్డి ఏ-2 ముద్దాయి కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే నూకాబిక్షం, కడారి రాంరెడ్డి హత్యల కేసుల్లో నువ్వు నిందితుడివా కాదా? అని అడిగారు. మద్య నిషేధ సమయంలో మద్యం అమ్ముతుంటే నీపై కేసు నమోదైందా? లేదా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News