Telugudesam: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే... మిత్రపక్షాలను లెక్కచేసే స్థితిలో బీజేపీ లేదు: టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు

  • విభజన తరువాత తీవ్ర అన్యాయం
  • హామీలు నెరవేరుస్తారనే బీజేపీతో స్నేహం
  • యుద్ధం చేసేందుకు టీడీపీ సిద్ధం
  • చివరి అస్త్రం తెగదెంపులే: టీజీ

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందూదొందేనని తెలుగుదేశం నేత టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో రెండు పార్టీలకూ ప్రమేయం ఉందని, ఇప్పుడు విభజన హామీలను నానుస్తూ వస్తున్న బీజేపీ, మరింత అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.

 ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన టీజీ వెంకటేశ్, ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రైల్వే జోన్ ఇస్తారన్న నమ్మకంతోనే బీజేపీపై ప్రేమను పెంచుకున్నామని చెప్పిన ఆయన, ఇప్పుడు బీజేపీ మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అవతరణ జరిగిన తరువాత కేంద్రంతో యుద్ధం చేయాలని ప్రతిపక్షాలు అంటున్నాయని, ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా విపక్షాలు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నాయని అన్నారు.

కేంద్రంతో తమ యుద్ధ ప్రక్రియ అంచెలంచెలుగా ఉంటుందని, బీజేపీకి లోక్ సభలో మెజారిటీ ఉన్నందున మిత్రపక్షాలను లెక్కచేసే పరిస్థితి కానీ, వారి డిమాండ్లను నెరవేర్చే పరిస్థితి కానీ లేవని అభిప్రాయపడ్డారు. డిమాండ్ల సాధనకు పార్లమెంటుతో పాటు బయట కూడా తాము యుద్ధం చేస్తామని, చివరి ప్రక్రియ తెగదెంపులేనని తెలిపారు.

More Telugu News