BSE: బడ్జెట్ దెబ్బ... పాతాళానికి సెన్సెక్స్... 500 పాయింట్లకు పైగా పతనం!

  • మూలధన లాభాలపై పన్ను ప్రతిపాదించిన జైట్లీ
  • ఈక్విటీల విక్రయానికి పోటీ పడుతున్న ఇన్వెస్టర్లు
  • ఎల్టీసీజీతో భారీగా నష్టమన్న అభిప్రాయాలు
  • 80 శాతం కంపెనీలు నష్టాల్లోనే

ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులపై మూలధన లాభాల పన్నును విధిస్తూ బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ఘోరంగా దెబ్బతీశాయి. అరుణ్ జైట్లీ బడ్జెట్ ఇన్వెస్టర్లతో స్నేహపూర్వకంగా లేదని గురువారమే సంకేతాలు రాగా, అవి శుక్రవారం నాడు అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకు పోటీ పడ్డారు. దీంతో ఇటీవలి కాలంలో స్థిరమైన లాభాలను నమోదు చేస్తూ, ఆల్ టైమ్ రికార్డులపై నడుస్తున్న భారత స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పాతాళానికి కుప్పకూలింది. ఎల్టీసీజీతో భారీగా నష్టపోతామని భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపారు.

శుక్రవారం ఉదయం సెషన్ ప్రారంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు 100 పాయింట్లు నష్టపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 10.30 గంటల సమయంలో 550 పాయింట్లకు పైగా నష్టపోయి 35,330 పాయింట్లకు పడిపోయింది. ఆపై స్వల్ప రికవరీ రావడంతో ప్రస్తుతం 486 పాయింట్ల నష్టంతో 35,420 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ సూచిక 145 పాయింట్లు నష్టపోయి 10,870 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ - 50లో 41 కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ం ఇన్ఫోసిస్, ఐచర్ మోటార్స్ తదితర కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, 80 శాతం లిస్టెడ్ కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News