medaram jathara: చంద్రగ్రహణంతో మేడారం జాతరకు సంబంధం లేదు.. సాయంత్రం గద్దెపైకి సారలమ్మ!

  • మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు
  • సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ
  • రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక
  • వన దేవతలకు గ్రహణం వర్తించదన్న ప్రధాన పూజారి

తెలంగాణలోని మేడారంలో నాలుగు రోజుల పాటు జరిగే మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు జాతర ప్రారంభంకానుంది. గద్దెల దిశగా పగిడిద్దరాజు పయనం మొదలైంది. అరణ్యం గుండా పయనించి, సాయంత్రం 6 గంటలకు ఆయన మేడారం చేరుకుంటారు. ఇక్కడి పెనక వంశీయులైన పూజారులు అరణ్యం గుండా 70 కిలోమీటర్లకు పైగా కాలినడకన గోవిందరావుపేట మండలం కర్లపెల్లి లక్ష్మీపురానకి చేరుకుని అక్కడి పెనక వంశీయుల కుటుంబీకులతో సేదతీరి... ఈ తెల్లవారు జామున 4 గంటలకు పగిడిద్దరాజుతో కలసి బయలు దేరారు.

ఆయన వెనుకే గోవిందరాజు కదులుతున్నారు. కన్నెపల్లి నుంచి జంపన్నను సంపెంగవాగు వద్ద ఉన్న రావిచెట్టు వద్ద ప్రతిష్టించారు. పగిడిద్దరాజు గద్దెలకు చేరుకోవడంతో జాతర మొదలవుతుంది. ఈ రోజే కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను తీసుకొస్తారు. రెండోరోజు (గురువారం) చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను పూజారులు తీసుచొచ్చి, గద్దెపైకి చేరుస్తారు.

మరోవైపు, ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో భక్తుల్లో కొంత అయోమయం నెలకొంది. దీనికి ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ వివరణ ఇచ్చారు. వనదేవతల పూజలకు గ్రహణం వర్తించదని ఆయన తెలిపారు. ఈ సాయంత్రం యథావిధిగా సారలమ్మను తీసుకొస్తామని చెప్పారు. కన్నెపల్లిలో పూజల అనంతరం సారలమ్మ గద్దెపైకి వస్తుందని తెలిపారు.

More Telugu News