Tollywood: మహిళా సంఘాల నేతలూ! ఇలాంటి పనికిమాలిన చర్చలకు వెళ్లకండి: తమ్మారెడ్డి భరద్వాజ సూచన

  • టీవీ ఛానెల్స్ లో పనికిమాలిన అంశాలపై చర్చల్లో వారు పాల్గొంటారా!
  • ఆ మూడు అంశాలపై చర్చల్లో పాల్గొని టైమ్ వేస్టు చేసుకున్నారు
  • భవిష్యత్ లో ఇలాంటి చర్చల్లో పాల్గొనకండి
  • ‘నా ఆలోచన’ లో తమ్మారెడ్డి భరద్వాజ సూచన

పవన్ కల్యాణ్ అభిమానులకు, కత్తి మహేశ్ కు నెలకొన్న వివాదంపైన, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెబ్ సిరీస్ గాడ్ సెక్స్ ట్రూత్ పైన, కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డి, ఏఎస్పీ సునీతారెడ్డి మధ్య వివాహేతర సంబంధంపైన టీవీ ఛానెల్స్ లో చర్చలు మొన్నటివరకూ మార్మోగిపోయిన విషయం తెలిసిందే. ఆయా చర్చా కార్యక్రమాల్లో మహిళా సంఘాల నేతలు పాల్గొనగా, ఇంకొంతమంది మహిళా నేతలు ఫోన్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విదితమే. దీనిపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

‘నా ఆలోచన’ ద్వారా తన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. ‘ఈ మూడు కేసుల్లోనూ మహిళా సంఘాలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. దీనిపై నా ఆలోచన ఏంటంటే.. సమాజం కోసం మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయి. ఎంతో గొప్ప సేవలు చేస్తున్నాయి. అయితే, ఈ అంశాలపై మాట్లాడేందుకు వారు టీవీ ఛానెల్స్ కు వచ్చి వాళ్ల టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారనేది నా ఉద్దేశమే కాదు నమ్మకం కూడా.

సమాజానికి ఏ రకంగానూ పనికిరాని ఈ మూడు విషయాలపై ఛానెల్స్ కోసం వారు మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ వెబ్ సిరీస్ గాడ్ సెక్స్ ట్రూత్ ను పోర్న్ సినిమాలు చూసే వారు మాత్రమే వీక్షిస్తారు. అది పోర్న్ ఫిల్మా? కాదా? అనే విషయాన్ని తర్వాత వారే చెప్పుకుంటారు. గాడ్ సెక్స్ ట్రూత్ పై చర్చించేందుకు టీవీ ఛానెల్స్ కు వారు మహిళా సంఘాల అవరు వెళ్లడం వల్ల దీనిపై ఒక ఆసక్తిని కొత్తగా సృష్టించారు. ‘పోర్న్’ ఫిల్మ్ చూడని వాళ్లకి కూడా దానిని చూడాలనే ఫీలింగ్ ను వీళ్లందరూ కలగజేశారు. వాళ్లకు అర్థమై చేశారో? అర్థం కాక చేశారో మరి! మహిళా సంఘాలు చాలా తప్పు చేశాయని నేను నమ్ముతున్నాను.

దయచేసి, ఇటువంటి పనికిమాలిన అంశాల కోసం మీరందరూ (మహిళా సంఘాల నేతలు) భవిష్యత్ లో నైనా టీవీ ఛానెల్స్ కు వెళ్లకుండా ఉంటే సంతోషం. గ్రామాల్లో, సిటీల్లో పలుచోట్ల మహిళా సంఘాల నేతలు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఏ ఛానల్ అయినా మీరు చేసే మంచిపనుల గురించి చెప్పిందా? మీరు ఆలోచించండి. ఈ పనికిమాలిన అంశాలపై మాట్లాడేందుకు మిమ్మల్ని టీవీ ఛానెల్స్ పిలిచాయి. మీరు చేస్తున్న సేవలు మీకు, నాకూ తెలుసు. ఎంతో బిజీగా ఉండే మీరు కూడా ఈ పనికిరాని అంశాల కోసం చర్చా కార్యక్రమాల్లో వచ్చి కూర్చుంటున్నారంటే నాకు బాధగా ఉంది. భవిష్యత్ లో మీరు ఇలా రాకూడదని, రారని అనుకుంటున్నా’ అని తమ్మారెడ్డి సూచించారు.

More Telugu News