పరిటాల ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్తే తప్పేముంది?: డొక్కా మాణిక్యవరప్రసాద్

30-01-2018 Tue 11:59
  • పరిటాల ఇంటికి పవన్ వెళ్లడం మంచి సంప్రదాయం
  • భూమా సంతాప సభకు కూడా జగన్ రాలేదు
  • వైసీపీవి దిగజారుడు రాజకీయాలు

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరూ ఊహించని విధంగా మంత్రి పరిటాల సునీత నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తనకు, పరిటాల కుటుంబానికి విభేదాలు ఉన్నాయన్న ఆరోపణలకు ఈ ఘటన ద్వారా పవన్ చెక్ పెట్టారు. దీనిపై ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పందించారు. పరిటాల ఇంటికి పవన్ వెళ్లడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఇది మంచి పరిణామమని చెప్పారు. సహచర ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణిస్తే... కనీసం సంతాప సభకు కూడా జగన్ రాలేదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం నిర్వహిస్తున్న 'దళిత తేజం' కార్యక్రమాన్ని విమర్శించడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని డొక్కా అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ సలహాలు ఇవ్వడం మానేసి... అసత్య ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. వినలేని, చూడలేని పరిస్థితిలో వైసీపీ ఉందని విమర్శించారు. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. వారి వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానమే స్పందించాలని అన్నారు. టీడీపీ మాత్రం మిత్ర ధర్మానికే కట్టుబడి ఉందని చెప్పారు.