AMERICA: అమెరికా అధ్యక్షుల వారి విమానంలో రెండు కొత్త ఫ్రిజ్ లు.. వాటి ఖర్చు 152.58 కోట్లు!

  • ఎయిర్ ఫోర్స్ వన్ లో కొత్త ఫ్రిజ్ ల ఏర్పాటు
  • ఎయిర్ ఫోర్స్ వన్ లో భోజనాలు నిల్వ చేసేందుకు ఐదు ఫ్రిజ్ లు వుంటాయి 
  • 2019 చివరినాటికి అందుబాటులోకి 

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణాలకు ఉపయోగించే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇందులో ఏకంగా ఐదు ఫ్రిజ్‌ లు ఉన్నాయి. అందులో రెండింటి స్థానంలో కొత్త ఫ్రిజ్ లు ఏర్పాటు చేయాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అమెరికా వైమానిక దళం బోయింగ్ తో 24 మిలియన్ డాలర్ల (152.58 కోట్ల రూపాయల) విలువైన ఒప్పందం చేసుకున్నారు.

పాత ఫ్రిజ్ లు అప్పటి టెక్నాలజీతో తయారు చేసినవి కావడంతో వాటిలో ఆహారం నిల్వ చేయడానికి తగినంత జాగా లేదని, ప్రయాణ సమయం పెరిగితే మళ్లీ ఆహారం తయారు చేసుకోవాల్సి వస్తోందని వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫ్రిజ్ లలో సుమారు 3 వేల మందికి సరిపడా భోజనాలను నిలవ చేసే జాగా వుండాలని వారు తెలిపారు. ఈ కొత్త ఫ్రిజ్ లలో 70 క్యూబిక్ ఫీట్ల స్థలం ఉంటుందని వారు చెప్పారు.

పాత ఫ్రిజ్ లు అత్యధిక వేడి సమయాల్లో సరిగ్గా పని చేయడం లేదని, కొత్త ఫ్రిజ్ లు అన్నిరకాల వాతావరణ పరిస్ధితులను తట్టుకునేలా తయారు చేయవలసి వుందని తెలిపారు. ఈ ఫ్రిజ్ లు 2019 చివరినాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాంట్రాక్టు ప్రకారం ఈ ఫ్రిజ్‌ ల ధర, పన్ను, వాటిని పరీక్షించడానికయ్యే ఖర్చు, ఫెడరల్‌ ఏవియేషన్‌ నుంచి సర్టిఫికేషన్‌ తదితరాలు అన్ని కలిపి ఇంత భారీ ఖర్చవుతుందని అధికారులు తెలిపారు.

More Telugu News