Pawan Kalyan: కాపు ఓట్ల కోసం పవన్ కల్యాణ్ ని ఓ ఏజెంట్ గా ఏపీ ప్రభుత్వం వాడుకుంటోంది: లక్ష్మీపార్వతి

  • రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నదో పవన్ కే స్పష్టత లేదు
  • ఆయన తీరు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా ఉంది
  • స్వతంత్ర భావాలు లేనటువంటి వ్యక్తి సమాజాన్ని మారుస్తారా?
  • ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు. ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ గురించి తాను చెప్పే దాని కంటే, రాజకీయ విశ్లేషకులు ప్రతిరోజూ బాగా చెబుతున్నారని అన్నారు. అసలు, జనసేన పార్టీని ఎందుకు పెట్టారో, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారనే దానిపై ఆయనకే స్పష్టత లేదని అన్నారు.

ఇప్పటివరకూ, ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా ఉందని అన్నారు. జనసేన పార్టీ పెట్టకముందు, టీడీపీ పార్టీకి మోదీతో కలిసి పవన్ ప్రచారం చేశారని, దీంతో తమ పార్టీకి కొంత నష్టం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి కాపు ఓట్ల కోసం పవన్ కల్యాణ్ ని ఓ ఏజెంట్ గా ఏపీ ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శించారు.

ఎవరైనా ఒక నాయకుడు సొంతంగా రాజకీయపార్టీ పెట్టాలంటే..స్వతంత్రమైన అభిప్రాయాలతో ముందుకురావాలని, కానీ, పవన్ కల్యాణ్ లో అటువంటి లక్షణాలు ఎక్కడా కనబడటం లేదని విమర్శించారు. స్వతంత్ర భావాలు లేనటువంటి వ్యక్తి సమాజాన్ని మారుస్తాననడం అసంఘటితమైన విషయమని, ప్రజావ్యతిరేకతకు పాల్పడుతున్న చంద్రబాబు వంటి వ్యక్తికి పవన్ కల్యాణ్ మద్దతివ్వడం సబబు కాదని అన్నారు.

 వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటిని పవన్ కల్యాణ్ చీలుస్తారని, దాని వల్ల ప్రతిపక్షపార్టీకి నష్టం కల్గించాలనే ఓ దుర్మార్గమైన ఆలోచన ఇదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యవహారం ఓ బ్రోకర్ లా ఉంది తప్పా, ప్రజలకు న్యాయం చేసే పద్ధతి మాత్రం ఇది కాదని అన్నారు.

More Telugu News