BSE: బుల్ పరుగులు... 11 వేల మార్క్ ను దాటేసిన నిఫ్టీ!

  • తొలిసారిగా 11 వేల మార్క్ ను తాకిన నిఫ్టీ
  • ఉత్సాహంగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ ఇన్వెస్టర్లు
  • 36 వేల మార్క్ ను దాటి ముందుకు వెళుతున్న సెన్సెక్స్

ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డుల్లో కొనసాగుతున్న భారత స్టాక్ మార్కెట్ మరింత ఎత్తునకు దూసుకెళ్లింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న పెట్టుబడులకు తోడు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రిటైల్ ఇన్వెస్టర్లు నూతనంగా ఈక్విటీల కొనుగోలుకు దిగుతుండటంతో, మార్కెట్ బుల్ ఎగిరి దుమికింది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే ఎన్ఎస్ఈ ఇండియా సూచిక నిఫ్టీ 11 వేల మార్క్ ను అధిగమించగా, బీఎస్ఈ సూచిక సెన్సెక్స్ 36 వేల మార్క్ ను దాటింది. నిఫ్టీ తొలిసారి 11 వేల మార్క్‌ను తాకడం విశేషం. దాదాపు అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లూ లాభాల్లో నడుస్తున్నాయి.

మంగళవారం ఉదయం 10.20 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే 236 పాయింట్లు పెరిగి 36,034 పాయింట్లకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 78 పాయింట్లు పెరిగి 11,044 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అర శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ-50లో 36 కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి. హిందాల్కో, వీఈడీఎల్, టాటా స్టీల్, ఐఓసీ, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు రెండు నుంచి ఐదు శాతం లాభాల్లో కొనసాగుతుండగా, జడ్ఈఈఎల్, అంబుజా సిమెంట్స్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, విప్రో తదితర కంపెనీలు అర శాతం నుంచి 1.70 శాతం నష్టాల్లో నడుస్తున్నాయి.

More Telugu News