USA: నరేంద్ర మోదీ ఆంగ్ల యాసను మిమిక్రీ చేసిన డొనాల్డ్ ట్రంప్!

  • భారత ఉపఖండం యాసలో ఇంగ్లీష్ మాట్లాడిన ట్రంప్
  • ఆఫ్గన్ అధికారులతో సమావేశమైన వేళ అనుకరణ 
  • ఆ దేశపు అధికారులకు అర్థం కావడానికేనన్న వైట్ హౌస్

భారత ఉపఖండంలో ఆంగ్ల భాషను ఏ యాసలో మాట్లాడతారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుసుకున్నారు. తన మిత్రుడు భారత ప్రధాని ఇంగ్లీషు మాట్లాడే తీరును గతంలోనే దగ్గర నుంచి గమనించిన ఆయన, ఇప్పుడు మోదీని అనుకరించారు. ఆఫ్గనిస్థాన్ పై అమెరికా విధానాన్ని గురించి చర్చిస్తున్న వేళ, భారత యాక్సెంట్ లో, మోదీ మాట్లాడినట్టుగా ట్రంప్ మాట్లాడారని 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

గత సంవత్సరం ఓవల్ ఆఫీసులో మోదీతో సమావేశమైన వేళ, మోదీ మాట తీరును ఆయన గమనించారని, ఆఫ్గన్ అధికారులతో మాట్లాడుతున్న వేళ, వారికి మరింత బాగా అర్థం కావాలన్న ఉద్దేశంతో ఆయన తన యాసను మార్చుకున్నారని తెలిపారు. కాగా, ఆఫ్గన్ కోసం తామెంతో ఖర్చు పెట్టామని, అందుకు తాము పొందిన ప్రతిఫలం చాలా స్వల్పమని గుర్తు చేసిన ట్రంప్, మరే దేశం కూడా పరాయి దేశం బాగు కోసం అంత భారీగా ఖర్చు పెట్టలేదని వ్యాఖ్యానించారు.

గతంలో ట్రంప్ పలువురిని అనుకరిస్తూ మాట్లాడిన వేళ, ఆయనో మిమిక్రీ ఆర్టిస్టులా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. గత అక్టోబరులో ఆయన 'మారియా' తుపాను బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్యూర్టోరికా యాసలో మాట్లాడారు. తన ఎన్నికల ప్రచార సభలో భారత కాల్ సెంటర్ ఉద్యోగిని మిమిక్రీ చేసి విమర్శలు కొనితెచ్చుకున్నారు.

More Telugu News