Telangana: గవర్నర్ నరసింహన్ కాదు.. ‘కల్వకుంట్ల నరసింహన్ రావు’!: పొన్నం ప్రభాకర్ వ్యంగ్యాస్త్రాలు

  • ప్రభుత్వ పథకాలను గవర్నర్ మెచ్చుకుంటే ఫర్వాలేదు
  • కేసీఆర్ ను, హరీష్ రావును ఈవిధంగా సంబోధించడమేంటి!
  • టీఆర్ఎస్ ప్రభుత్వానికి వీలుంటే నరసింహన్ కు ‘భజనశాఖ’ కేటాయించాలి : పొన్నం సెటైర్

కేసీఆర్ ను..కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని, హరీష్ రావుని..కాళేశ్వరరావు అని గవర్నర్ నరసింహన్ ప్రశంసలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వీలుంటే నరసింహన్ కు ‘భజనశాఖ’ కేటాయించాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రభుత్వ పథకాలను గవర్నర్ మెచ్చుకుంటే ఫర్వాలేదు గానీ, కేసీఆర్ ను, హరీష్ రావును ఈ విధంగా సంబోధించడమేంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్ ను ‘కల్వకుంట్ల నరసింహన్ రావు’ అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించిన రోజే రాజ్ భవన్ ప్రతిష్ట మంట గలిసిపోయిందని విమర్శించారు.

కాగా, గవర్నర్ పై సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి కూడా మండిపడ్డారు. గవర్నర్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే టీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చని, ఆయన చేసిన వ్యాఖ్యలు హోదాకు తగ్గట్టు లేవని విమర్శించారు. కేసీఆర్ కు కితాబివ్వడానికి కాళేశ్వరంలో నరసింహన్ పర్యటించారని, కాంగ్రెస్ హయాంలోనే ప్రాణిహిత-చేవెళ్లకు అంకురార్పణ చేశారని, ప్రాజెక్టు చరిత్ర తెలుసుకుని నరసింహన్ మాట్లాడాలని  అన్నారు.

More Telugu News