World cup: అంధుల క్రికెట్ ప్రపంచకప్ భారత్‌దే.. ఫైనల్లో పాక్‌ చిత్తు!

  • షార్జాలో జరిగిన ఫైనల్స్ 
  • భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్
  • అభినందించిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్

టోర్నీ ఏదైనా ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న భారత్ మరోసారి అదే పనిచేసి అంధుల క్రికెట్ ప్రంపచకప్‌ను సగర్వంగా దేశానికి అందించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో షార్జాలో శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. తెలుగువాడైన అజయ్ కుమార్ రెడ్డి  సారథ్యంలోని జట్టు అద్భుత విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 308 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో పది బంతులు మిగిలి ఉండగానే 38.2 ఓవర్లలో ఛేదించింది. సునీల్ రమేశ్ 93 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోగా కెప్టెన్ అజయ్ రెడ్డి 63 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రకాశ్ (44), వెంకటేశ్వర రావు (35) రాణించారు.

తొలుత టాస్ నెగ్గిన పాక్ నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. బాదర్ మునీర్ 57, రియాసత్ 48, కెప్టెన్ నిసార్ అలీ 47 పరుగులతో రాణించారు. ప్రపంచ విజేతగా నిలిచిన టీమిండియాకు ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్, పాక్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్, టీమిండియా మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీలు ట్రోఫీని బహూకరించారు. ప్రపంచకప్‌లో భారత్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించడం విశేషం. కాగా, గతేడాది భారత్‌లో జరిగిన టీ-20 ప్రపంచకప్‌లోనూ అజయ్ రెడ్డి సారథ్యంలోని జట్టు విజేతగా నిలిచింది. ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టుకు రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.  

More Telugu News