Kanchi Kamakoti Peetham: కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత... పరిస్థితి విషమం!

  • చెన్నై రామచంద్ర హాస్పిటల్ కు తరలింపు
  • స్పృహలేని స్థితిలో ఆసుపత్రికి
  • వెంటిలేటర్ పై ఉంచామన్న వైద్యులు
  • కంచి పీఠానికి 69వ పీఠాధిపతి

కంచి కామకోటి 69వ పీఠాధిపతి, శంకరాచార్య జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆదివారం నాడు ఒక్కసారిగా ఆయన బ్లడ్ షుగర్ పడిపోవడం, శ్వాస తీసుకోలేక పోతుండటంతో చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ను స్పృహలేని స్థితిలో ఆసుపత్రికి తీసుకు వచ్చారని, వెంటిలేటర్ ఆధారంగా శ్వాసను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

 మార్చి 22, 1954న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తన వారసుడిగా జయేంద్రను పీఠాధిపతిగా ప్రకటించారు. తదనంతర కాలంలో బాధ్యతలు స్వీకరించారు. 2016 ఆగస్టులో విజయవాడలో పర్యటిస్తున్న వేళ, ఆయన ఆరోగ్యం మందగించడంతో ఆసుపత్రిలో చికిత్సను అందించారు. గత సంవత్సరం నవంబరులో ఢిల్లీలో పర్యటించి వచ్చిన తరువాత శంకరాచార్య, ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. కాగా, క్రీస్తు పూర్వం 482లో శ్రీ ఆది శంకర స్థాపించిన కంచి కామకోఠి పీఠానికి, ఇప్పటివరకూ 69 మంది ఆచార్యలు సేవలందించారు. జయేంద్ర సరస్వతి తరువాత 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి సేవలందిస్తున్నారు.

More Telugu News