Minister: మంత్రి అచ్చెన్నాయుడుని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్.. ఈజీ మనీ కోసం జ్యోతిష్యుడి నయా ప్లాన్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడుని చంపేస్తామని బెదిరించిన జ్యోతిష్యుడిని శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ త్రివిక్రమ వర్మ వెల్లడించారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన మురపాక కాళిదాసు శర్మ జ్యోతిష్యుడు. ప్రముఖులకు నిత్యం టచ్‌లో ఉండే శర్మ వారి గ్రహాలు అనుకూలంగా లేవని చెప్పి ప్రత్యేక పూజల పేరుతో డబ్బులు గుంజడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఇతని వద్ద ఒడిశాలోని రాయగఢకు చెందిన జోస్యుల శంకర్‌రావు పనిచేస్తున్నాడు.

ప్రముఖుల నుంచి భారీ ఎత్తున డబ్బులు గుంజాలన్న లక్ష్యంతో ఇద్దరూ కలిసి ప్రత్యేక ప్రణాళిక తయారుచేసుకున్నారు. ప్రముఖుల్లో తొలుత ప్రాణభయం లేవనెత్తి పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. అందులో భాగంగా రాయగఢలో గిరిజనుడి పేరిట సిమ్‌కార్డును కొనుగోలు చేసి దాని ద్వారా మంత్రి అనుచరుడికి ఫోన్ చేశారు.

తాము నక్సలైట్లమని అచ్చెన్నాయుడిని చంపేస్తామని బెదిరించారు. పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. తనకు ప్రాణహాని ఉందని అచ్చెన్నను నమ్మించేందుకు అచ్చెన్న పయనించే మార్గంలో ఓ చోట జిలెటిన్ స్టిక్స్ అమర్చారు. పోలీసుల తనిఖీల్లో ఇవి బయటపడ్డాయి. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు శంకర్‌రావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతడిచ్చిన సమాచారంతో కాళిదాసు శర్మను కూడా అదుపులోకి తీసుకుని ఇద్దరినీ జైలుకు తరలించారు.  
Go Back to Shorts
Minister
Atchannaidu
Andhra Pradesh

More Telugu News