Tamilnadu: దినకరన్, పళనిస్వామి వర్గాల విభేదాలు ఒట్టి డ్రామానా? తమిళనాడు ప్రభుత్వం ఇంకా చిన్నమ్మ కనుసన్నల్లోనే నడుస్తోందా?

  • అనుమానాలు వ్యక్తం చేస్తున్న పన్నీరు సెల్వం వర్గం
  • శశికళ కనుసన్నల్లో పళనిస్వామి 
  • చిన్నమ్మ ముందుచూపులో భాగమే ‘కేంద్రం’తో సఖ్యత 

 జయలలిత మృతితో తమిళనాట ఎన్నో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకే అధినేత స్థానంతో పాటు, సీఎం పదవిని దక్కించుకోవాలని చిన్నమ్మ శశికళ చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో అన్నాడీఎంకేలో చీలికలు ఏర్పడటం, ఎవరు ఏ వర్గానికి మద్దతు ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొనడం, అప్పటికే, తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరుసెల్వం.. ముఖ్యమంత్రి పదవి కోసం విఫలయత్నం చేయడం, బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకుని సయోధ్యకు యత్నించడం తెలిసిందే.

ఈ క్రమంలో చిన్నమ్మ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత, టీటీవీ దినకరన్, పళనిస్వామి వర్గాల మధ్య విభేదాలు తలెత్తడం విదితమే. అయితే, దినకరన్, పళనిస్వామి వర్గాల మధ్య విభేదాలు ఒట్టి డ్రామా అని పన్నీరు సెల్వం వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న సంక్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీని, పాలనను కాపాడుకునేందుకే ఈ నాటకీయ పరిణామాలను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.

పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం శశికళ కనుసన్నల్లోనే ఉందని, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించడం కూడా చిన్నమ్మ ముందుచూపులో భాగమేనని పన్నీరు వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిగిన ఆర్కేనగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన దినకరన్ గెలుపుపై పన్నీర్ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికార  పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పన్నీర్ మద్దతుదారుడు మధుసూదన్ ఓటమి పాలయ్యారు. రెండో స్థానంలో నిలిచారు. అయితే, దినకరన్ కు ఇంతటి భారీ విజయం (40 వేల మెజారిటీతో) దక్కడంపై అనుమానం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్ఠానానికి  ఆయన ఇటీవల ఓ లేఖ రాశారు.

మధుసూదన్ గెలుపునకు అన్నాడీఎంకే నిర్వాహకులు, రాష్ట్ర మంత్రులు పనిచేయలేదని, దినకరన్ విజయం సాధించేందుకు వారు పనిచేశారని పన్నీర్ వర్గం ఆరోపణ. ఉపఎన్నికలకు ముందు తన సత్తా చూపిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన దినకరన్ గెలిచిన తర్వాత మారుమాట్లాడకుండా ఉండటం, ఉపఎన్నిక ముందు విడుదలైన జయలలిత ఆసుపత్రిలో ఉన్న వీడియోను విడుదల చేసినప్పుడు మండిపడ్డ శశికళ మేనకోడలు విష్ణుప్రియ, ఆ తర్వాత మౌనంగా ఉండిపోవడం, సీనియర్ మంత్రి సెంగొట్టియాన్ సహా ఇతర మంత్రులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం, శశికళ, దినకరన్ పై ఎటువంటి విమర్శలు చేయకపోవడం వంటి అంశాలను పన్నీర్ వర్గం ప్రశ్నిస్తోంది. ఇదంతా చూస్తుంటే పళనిస్వామి వర్గం ఇంకా చిన్నమ్మ కనుసన్నల్లోనే నడుస్తోందని పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది.

More Telugu News