Air Conditioner: 41 ఏటీఎంల నుంచి 80 ఏసీలను మాయం చేసిన విద్యార్థులు.. హైదరాబాద్ పోలీసుల అదుపులో యువకులు

  • అందరూ చూస్తుండగానే ఏసీలను మాయం చేస్తున్న ముఠా
  • ఒక్కో ఏసీని రూ. 4 వేలకు విక్రయానికి పెట్టిన వైనం
  • నిందితులందరూ 18-21 ఏళ్ల లోపువారే

ఏటీఎం కేంద్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఏసీలను మాయం చేస్తున్న ఐదుగురు యువకులను హైదరాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏసీల విషయం బయటపడింది.

నగరంలోని వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల నుంచి 80 ఏసీలను దొంగిలించినట్టు వీరు అంగీకరించారు. పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురు నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు. 23 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 41 ఏటీఎం సెంటర్ల నుంచి 80 ఏసీలను వీరు మాయం చేసినట్టు పోలీసులు తెలిపారు.

అందరూ చూస్తుండగా పట్టపగలే, ఏటీఎంలో జనాలు డబ్బులు డ్రా చేసుకుంటున్న సమయంలోనే వీరు ఏసీ దొంగతనాలకు పాల్పడుతుండడం గమనార్హం.  సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలనే వీరు లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా అడిగితే ఏసీ రిపేరింగ్ చేయడానికి వచ్చామని చెబుతూ బురిడీ కొట్టించే వారని పేర్కొన్నారు.

దొంగిలించిన ఏసీలను ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ‘ఓఎల్ఎక్స్’లో అమ్మకానికి పెట్టగా ఫలితం లేకపోవడంతో ఫతేదర్వాజాలో ఓ ఏసీ మెకానిక్ షాపులో ఒక్కో ఏసీని రూ.4 వేలకు అమ్మకానికి పెట్టారు. కాగా, ఏసీల మాయంపై పలు బ్యాంకులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దర్యాప్తులో ఉండగానే నిందితులు పోలీసులకు చిక్కారు. మహమ్మద్ అహ్‌సాన్ రహ్మాన్, సయ్యద్ అక్రం, మహ్మద్ ఆదిల్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ వాజీద్ ఖాన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 18-21 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. కాగా, వీరిలో ముగ్గురు ఇంటర్, డిగ్రీ చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News